సిరీస్‌పై టీమ్ఇండియా కన్ను.. నేడే రెండో టీ20
Second T20 Between India VS West indies Today.ఇప్పటికే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్ఇండియా అదే జోరులో టీ20
By తోట వంశీ కుమార్ Published on 18 Feb 2022 3:00 AM GMTఇప్పటికే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్ఇండియా అదే జోరులో టీ20 సిరీస్‌ను చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది. తొలి టీ20లో గెలిచిన రోహిత్ సేన నేడు కోల్‌కతా వేదికగా జరిగే రెండో టీ20లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలిఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని బావిస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని వెస్టిండీస్ గట్టి పట్టుదలతో ఉంది.
గాయం కారణంగా రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ లేకపోవడంతో తొలి టీ20లో ఓపెనింగ్ చేసిన ఇషాన్ కిషన్ ఫర్వాలేదనిపించాడు. అయితే.. తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. అయినప్పటికీ ఇషాన్‌పై రోహిత్‌కు గురి ఉండడంతో రెండో టీ20లోనూ ఇషాన్ తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేయనున్నాడు. గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా విరాట్ కోహ్లీ ఫామ్‌ను అందుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
సూర్యకుమార్ యాదవ్ జోరుమీదుండడం భారత్‌కు సానుకూలంశం. ఇక తొలి టీ20లొ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్‌లు రెండో టీ20లో ఆడేది అనుమానంగా మారింది. చాహర్ స్థానంలో సిరాజ్ లేదా అవేశ్‌ఖాన్‌లలో ఒకరు ఆడే అవకాశం ఉంది. ఇక వెంకటేశ్ అయ్యర్ కు అయిన గాయం తీవ్రమైనది కాకపోవడంతో అతడిని రెండో టీ20లో ఆడిస్తారా..? లేక విశ్రాంతి నిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
తొలి టీ20లో భారత స్పిన్నర్లు ఎదుర్కొనలేక వెస్టిండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో స్పిన్నర్లను ఎదుర్కొనడంపైనే విండీస్ ప్రధానంగా దృష్టిసారించింది. ఇక షాట్ల ఎంపికలో పొరపాట్లను సరిదిద్దుకోవాలని విండీస్ బ్యాటర్లు బావిస్తున్నారు. పూరన్ ఫామ్‌లోకి రావడం విండీస్‌కు సానుకూలంశం. ఇక కెప్టెన్ పొల్డార్, కింగ్, మేయర్స్, పావెల్‌లు కూడా రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. తొలి టీ20కి దూరమైన జేసన్ హోల్డర్ రెండో టీ20లో బరిలోకి దిగనున్నాడు. విధ్వంసకర బ్యాటర్లకు పెట్టింది పేరైన విండీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.