బోణీ కొట్టేది ఎవరో..? కివీస్‌తో భారత్ రెండో టీ20 నేడు
Second T20 between India and NewZealand Today.భారత్, కివీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
By తోట వంశీ కుమార్ Published on 20 Nov 2022 4:44 AM GMTమూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగనుయ్ వేదికగా నేడు(ఆదివారం) భారత్, కివీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ వర్షం కాగా రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే.. రెండో టీ20కి కూడా వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని ఇరు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో నిష్క్రమించాక భారత్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంలో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే ఉంది. సినీయర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో హార్థిక్ పాండ్యా సారథ్యంలోని భారత యువ జట్టు ఎలా ఆడుతుందనే ఆసక్తి అందరిలో ఉంది.
ఇషాన్ కిషన్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ తన జోరును కొనసాగించాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. టీ20 ప్రపంచకప్‌లో సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయిన పంత్ ఎలా రాణిస్తాడో చూడాలి. దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్‌ల మధ్య పోటీ నెలకొంది. సీనియర్ ఆటగాడు అయిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించనున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్‌లు పేస్ భారాన్ని పంచుకోనుండా, చాహల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. భవిష్యత్తు టీ20 కెప్టెన్‌గా నియమితుడవుతాడని అంతా బావిస్తున్న హార్థిక్.. తాత్కాలిక నాయకుడిగా జట్టును ఎలా నడిపిస్తాడో అన్న ఆసక్తి నెలకొంది.
మరోవైపు కివీస్ ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఆ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ఓపెనర్లు కాన్వే, అలెన్ శుభారంభం అందిస్తే.. విలియమ్ సన్, ఫిలిప్స్, మిచెల్ మెరుపులు మెరిపించేందుకు సిద్దంగా ఉన్నారు. సౌథీ, ఫెర్గూసన్, సోధి, శాంట్నర్‌లతో కూడిన బౌలింగ్ దళం భారత బ్యాటర్లకు పరీక్ష పెట్టడం ఖాయం.