ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పరుగుల వర్షంలో తడిసిముద్దైన అభిమానులకు మరో వినోదాన్ని అందించేందుకు టీ 20 ప్రపంచ కప్ సిద్దమైంది. నేటి నుంచి ఈ పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 24న దాయాది పాకిస్థాన్‌తో ఆడనుంది. అయినప్పటికి మన హైదరాబాదీల కళ్లు నేడు జరిగే ఒమన్-పపువా న్యూ గినియా మ్యాచ్‌పై ఉండనున్నాయి. అందుకు కారణం ఒమన్ జట్టుకు హైదరాబాదీ యువకుడు ప్రాతినిధ్యం వహిస్తుండడమే.
హైదరాబాద్ కవాడిగూడకు చెందిన 29 ఏళ్ల శ్రీమంతుల సందీప్ గౌడ్ ఆదివారం ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో ఒమన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 2005-08మధ్య హైదరాబాద్ అండర్-15, 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2016లో ఒమన్‌లోని ఖిమ్జి రామ్‌దాస్ కంపెనీలో ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌గా ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయాడు. అయితే.. క్రికెట్‌పై అతడికి ఉన్న ప్రేమ తగ్గలేదు. దీంతో ఉద్యోగం చేస్తూనే అక్కడి దేశవాళీ మ్యాచుల్లో ఆడి సత్తా చాటడంతో ఒమన్ జాతీయ జట్టుకు ఎంపికైయ్యాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన అరంగేట్ర మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన సందీప్ రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 19 బంతుల్లోనే 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అన్నట్లు సందీప్ మంచి ఆల్‌రౌండర్. ఆ జట్టులో అతడే కీలక ఆటగాడు కావడం విశేషం.