సామ్ క‌ర‌న్‌కు చేదు అనుభం.. సీటు విరిగింద‌ని.. విమానం ఎక్క‌నివ్వ‌లేదు

Sam Curran Shares Shocking Experience With Virgin Atlantic.ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ శామ్ క‌ర‌న్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2023 11:30 AM IST
సామ్ క‌ర‌న్‌కు చేదు అనుభం.. సీటు విరిగింద‌ని.. విమానం ఎక్క‌నివ్వ‌లేదు

ఇటీవ‌ల జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) వేలంలో అత్య‌ధిక ధ‌ర‌ను సొంతం చేసుకున్న‌ ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. అత‌డిని విమానంలోకి ఎక్క‌నివ్వ‌లేదు. ఈ ఘ‌ట‌న పై అత‌డు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డంతో పాటు దిగ్భ్రాంతికి గురైన‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు.

బ్రిటీష్ విమాన‌యాన సంస్థ వర్జిన్ అట్లాంటిక్ కు చెందిన విమానంలో ప్ర‌యాణించేందుకు సామ్ క‌ర‌న్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే.. ప్ర‌యాణానికి కాసేప‌టి ముందు అత‌డికి కేటాయించిన సీటు విరిగిపోయింద‌నే కార‌ణంతో అత‌డిని విమానం ఎక్కేందుకు సిబ్బంది అనుమ‌తించ‌లేదు.

" వర్జిన్‌అట్లాంటిక్ కు చెందిన విమానంలో ప్ర‌యాణించ‌డానికి సిద్ధం అవుతుండ‌గా నాకు విమానంలో కేటాయించిన సీటు విరిగిపోయింద‌ని సిబ్బంది తెలిపారు. కాబ‌ట్టి విమానంలో నేను ప్ర‌యాణించ‌డం కుద‌ర‌దు అని చెప్పారు. ఇది పిచ్చిత‌నంగా అనిపించింది. ధ‌న్య‌వాదాలు వర్జిన్ అట్లాంటిక్. ఈ ఘ‌ట‌న కార‌ణంగా నేను తీవ్ర అసౌక‌ర్యానికి గురి కావ‌డంతో పాటు దిగ్భ్రాంతికి గురైయ్యా.. అని సామ్ క‌ర‌న్ ట్వీట్ చేశాడు.

సామ్ ట్వీట్ పై స‌ద‌రు ఎయిర్‌లైన్స్ స్పందించింది. "ఇలా జ‌ర‌గ‌డం బాధాక‌ర‌ణం. ఇందుకు మేము మీకు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాం. ఈ విష‌యాన్ని మీరు మా హెల్ప్‌లైన్ సిబ్బంది దృష్టికి తీసుకుని వ‌చ్చి ఉంటే మీకు వేరే విమానంలో సీటు కేటాయించే వాళ్లు. మీ యొక్క స్పంద‌న‌ను మా క‌స్ట‌మ‌ర్ కేర్ టీమ్‌కు పంపండి." అని రిప్లై ఇచ్చింది.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు. తమ‌కు ఇలాంటి ఘ‌ట‌న‌నే ఎదురైన‌ట్లు ప‌లువురు కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 18.5 కోట్లు వెచ్చించి సామ్‌ను సొంతం చేసుకుంది.

Next Story