టీచర్ జాబ్‌కు ధోని దరఖాస్తు.. తండ్రి సచిన్.. సోషల్ మీడియాలో వైరల్
Sachin Tendulkar's son MS Dhoni applies for teacher's job.భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో దిగ్గజ ఆటగాడు
By తోట వంశీ కుమార్ Published on 3 July 2021 7:55 PM ISTభారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో దిగ్గజ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకట. అంతేకాదండోయ్ ధోని టీచర్ జాబ్‌కు సైతం దరఖాస్తు చేసుకున్నాడట. అదేంటి మీకు ఎమన్నా మతి పోయిందా..? సచిన్ కొడుకు అర్జున్ టెండ్కూలర్‌కు గదా.. మరీ ఇలా ఎందుకు అంటున్నారని కంగారు పడకండి. ఓ ఆకతాయి చేసిన పని.. ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే..చత్తీస్‌గడ్‌లో ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయుల పోస్టులకు గతంలో నోటిఫికేషన్ వెలువడింది. ఎంతో మంది ఆ పోస్టుకు దరఖాస్తు చేసుకోగా.. మార్కుల ఆధారంగా కొంత మందిని షార్ట్ లిస్ట్ చేశారు. అలా షార్ట్ లిస్ట్ చేసిన 15 మంది అభ్యర్థులను తాజాగా ఇంటర్య్వూలకు పిలిచారు. ఆ షార్ట్ లిస్ట్‌లో తొలిపేరు మహేంద్ర సింగ్ ధోని సన్నాఫ్ సచిన్ టెండూల్కర్.. రాజ్‌పూర్ జిల్లా అని రాసి ఉంది. అప్లికేషన్ ప్రకారం ఎంఎస్ ధోని దుర్గ్‌లోని సీఎస్‌వీటీయూ యునివర్సిటీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేయగా.. స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఎవరో ఆకతాయి ధోనీ, సచిన్ పేర్లతో టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసినట్లు తెలుసుకున్నారు.
ఈ వ్యవహారం ఇంటర్య్వూకు వచ్చిన మిగతా అభ్యర్థులకు తెలియడంతో దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. అధికారులు దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయ్‌పూర్ పోలీసులు సదరు గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇలాంటి అప్లికేషన్లు వచ్చినప్పుడు అధికారులు చెక్ చేయకుండా ఏం చేస్తున్నారని.. ఇంటర్వ్యూ రౌండ్ వరకు గుర్తించకుండా ఏం చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.