రైతుల‌కు శుభ‌వార్త‌.. నేటి నుంచి రైతుబంధు సాయం

Rythu Bandhu aid starts from today in Telangana. అన్నదాతలకు శుభవార్త. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు బంధు పెట్టుబ‌డి

By Medi Samrat  Published on  28 Dec 2020 5:23 AM GMT
రైతుల‌కు శుభ‌వార్త‌.. నేటి నుంచి రైతుబంధు సాయం

అన్నదాతలకు శుభవార్త. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు బంధు పెట్టుబ‌డి సాయం సోమ‌వారం నుంచి రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మొత్తం 61.49ల‌క్ష‌ల మంది రైతుల‌కు రైతుబందు సాయంగా రూ.7,515 కోట్లు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఎక‌రానికి రూ.5వేల చొప్పున 1.52కోట్ల ఎక‌రాల‌కు అందిస్తున్నామ‌న్నారు. రైతుబందు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి రైతు బంధు సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఈ రోజు నుంచి జనవరి 7వ తేదీ వరకు విడతల వారీగా రైతు బంధు సొమ్మును అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటగా ఎకరంలోపు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయాన్ని జమ చేయనున్నారు. ఆ తర్వాత రెండెకరాల లోపు పొలం ఉన్నవాళ్లకు.. ఆపై మూడెకరాల లోపు పొలం ఉన్నవారికి.. విడతల వారీగా నగదు జమ చేయనున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకు, ఏటీఎంల ద్వారానే కాదు.. పోస్టాఫీసుల నుంచి కూడా పొందవచ్చు.

ఆదివారం ప్రగతిభవన్‌లో యాసంగి రైతుబంధు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రైతుబీమా, పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగువిధానం, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు.

ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసిందని, ప్రతిసారీ అలా చేయడం సాధ్యంకాదని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌భుత్వం వ్యాపార సంస్థ కాద‌న్నారు. కొనుగోళ్లు, అమ్మ‌కాలు ప్ర‌భుత్వ బాధ్య‌త కాద‌న్నారు. వ‌చ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డం సాధ్య‌ప‌డ‌దు. దేశంలో అమ‌ల‌వుతున్న కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలు కూడా రైతులు త‌మ పంట‌ల‌ను ఎక్క‌డైనా అమ్ముకోవ‌చ్చున‌ని చెబుతున్నాయి. కాబ‌ట్టి ప్ర‌భుత్వ‌మే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.


Next Story