అశ్విన్ ఆల్‌రౌండ్ షో.. ప్లేఆఫ్స్ బెర్తుతో పాటు రెండో స్థానం

RR beat CSK by five wickets to finish in top-2 in IPL league phase.నాలుగేళ్ల త‌రువాత రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఇండియ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 May 2022 8:10 AM IST
అశ్విన్ ఆల్‌రౌండ్ షో.. ప్లేఆఫ్స్ బెర్తుతో పాటు రెండో స్థానం

నాలుగేళ్ల త‌రువాత రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)లో ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించింది. ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆల్‌రౌండ్ షో తో చెన్నైపై విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ ద‌క్కించుకోవ‌డ‌మే కాక పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో నిలిచింది. ఇటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, అటు ల‌క్నో సూప‌ర్ జెయింగ్స్ లు రెండు కూడా 18 పాయింట్ల‌తో ఉన్నా.. మెరుగైన ర‌న్‌రేట్ కార‌ణంగా రాజ‌స్థాన్‌(0.298) కు రెండో స్థానం ద‌క్కింది. లీగ్ ద‌శ‌లో టాప్‌-2లో నిలిచిన జ‌ట్ల‌కు ప్లే ఆఫ్స్‌లో ఒక మ్యాచ్ ఓడినా మ‌రో అవ‌కాశం ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండానే బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ లీగ్ ద‌శ‌ను విజ‌యంతో ముగించింది. శుక్ర‌వారం ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో ఆ జ‌ట్టు 5 వికెట్ల తేడాతో చెన్నైను మ‌ట్టిక‌రిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 150 ప‌రుగులు చేసింది. ఇంగ్లాండ్ ఆట‌గాడు మొయిన్ అలీ (93; 57 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంస‌క ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (26), కాన్వే (16) లు కాస్త ఫ‌ర్వాలేద‌నిపించ‌గా.. మిగిలిన వారిలో రుతురాజ్ గైక్వాడ్‌(2), జ‌గ‌దీష‌న్‌(1),అంబ‌టి రాయుడు(3), శాంట్న‌ర్‌(1) లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో చాహ‌ల్‌, మెకాయ్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బౌల్ట్‌, అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు.

అనంత‌రం ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 19.4 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (59; 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌) ఆరంభంలో ధాటిగా ఆడ‌గా.. ఆఖ‌ర్లో ఒత్తిడిని అధిగ‌మిస్తూ ర‌విచంద్ర‌న్ అశ్విన్ (40 నాటౌట్‌; 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చూడ‌ముచ్చ‌టైన ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించాడు. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో బ‌ట్ల‌ర్‌(2), కెప్టెన్ సంజూ శాంస‌న్‌(15),ప‌డిక్క‌ల్‌(3),హెట్ మెయిర్‌(6) లు విఫ‌లమైన అశ్విన్ రాణించ‌డంతో రాజ‌స్థాన్ ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌డంతో పాటు లీగ్ ద‌శ‌లో రెండో స్థానంలో నిలిచింది. చెన్నై బౌలర్లలో ప్రశాంత్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది. ఇక రాజ‌స్థాన్ మంగ‌ళ‌వారం తొలి క్వాలిఫయర్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

Next Story