భారత్‌తో వన్డే సిరీస్.. 14 నెలల తర్వాత జట్టులోకి ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్
ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 5 Feb 2025 7:43 PM ISTఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరగనుంది. భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్‌కు మద్దతుగా నిలిచాడు. చాలా కాలం తర్వాత రూట్ మళ్లీ వన్డేల్లోకి వస్తున్నాడు. అతడు చివరిసారిగా 2023 ప్రపంచకప్‌లో వన్డే ఆడాడు. టోర్నీలో అతని ప్రదర్శన కాస్త నిరాశపరిచింది. రూట్ తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 30.66 సగటుతో 276 పరుగులు చేశాడు. 3 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. దాదాపు 14 నెలల తర్వాత రూట్ వన్డేలలో పునరాగమనం చేస్తున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్ జోస్ బట్లర్.. జో రూట్‌కు మద్దతుగా నిలిచాడు.
నాగ్‌పూర్ వన్డేకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో బట్లర్ మాట్లాడుతూ.. "క్రికెట్‌లోని దిగ్గజాలలో జో రూట్ ఒకడు. అతను అన్ని ఫార్మాట్లలోనూ.. చాలా కాలం పాటు ఇంగ్లండ్‌కు వన్డే క్రికెట్‌లో ముఖ్యమైన ఆటగాడిగా ఉన్నాడు. అతనికి వన్డే క్రికెట్‌లో చాలా అనుభవం ఉంది. మా జట్టులో చాలా మంది ఆటగాళ్లకు అంత అనుభవం లేదు. ఇంగ్లండ్‌కు అన్ని ఫార్మాట్లలో రూట్ ముఖ్యమైన ఆటగాడు. సిరీస్‌లో అతడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడని మేము భావిస్తున్నాము అని అన్నాడు.
గత కొంతకాలంగా రూట్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది 17 మ్యాచ్‌ల్లో 55.57 సగటుతో 1,556 పరుగులు చేశాడు. టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వన్డేల్లో భారత్‌పై మంచి రికార్డు కూడా ఉంది. 22 మ్యాచ్‌లు ఆడి 20 ఇన్నింగ్స్‌ల్లో 43.47 సగటుతో 739 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు సాధించాడు. రూట్ స్పిన్నింగ్ ట్రాక్‌లపై బాగా బ్యాటింగ్ చేస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లండ్‌కు రూట్ ఫామ్ చాలా ముఖ్యం. జో రూట్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 171 వన్డే మ్యాచ్‌లు ఆడి 160 ఇన్నింగ్స్‌లలో 47.60 సగటు, 86.77 స్ట్రైక్ రేట్‌తో 6,522 పరుగులు చేశాడు. రూట్ వన్డేలలో 39 అర్ధశతకాలు, 16 సెంచరీలు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 133 పరుగులు నాటౌట్. అతను తన చివరి ODIని 11 నవంబర్ 2023న కోల్‌కతాలో పాకిస్తాన్‌తో ఆడాడు.