ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రచ్చ.. సంచలన పోస్టు పెట్టిన రోహిత్ శర్మ భార్య..!

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ మార్పుపై ఆ జట్టు కోచ్‌ మార్క్‌ బౌచర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అయ్యాయి.

By Medi Samrat  Published on  6 Feb 2024 3:17 PM IST
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రచ్చ.. సంచలన పోస్టు పెట్టిన రోహిత్ శర్మ భార్య..!

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ మార్పుపై ఆ జట్టు కోచ్‌ మార్క్‌ బౌచర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అయ్యాయి. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు ఉన్న రోహిత్‌ శర్మను ఇటీవలే కెప్టెన్ గా తప్పించి.. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుండి రోహిత్ శర్మ అభిమానులు ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై ఆగ్రహంగా ఉన్నారు.

ముంబై కోచ్‌ మార్క్‌ బౌచర్‌ స్మాష్‌ స్పోర్ట్స్‌ పాడ్‌కాస్ట్‌లో స్పందిస్తూ.. ఇది పూర్తిగా క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయం. హార్దిక్‌ను తిరిగి రప్పించి ఆటగాడిగా కొనసాగించాలనే తొలుత భావించాం. కానీ ప్రస్తుతం జట్టు పరివర్తన చెందే దశలో ఉంది. ఇండియాలో చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్నారు. వాటికి అతీతంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా చెప్పినట్లుగానే ఇది పూర్తిగా క్రికెటింగ్‌ డెసిషన్‌. రోహిత్‌లోని ఆటగాడిని మరోసారి అత్యుత్తమ స్థాయిలో చూడాలనుకుంటున్నామని తెలిపారు. రోహిత్ ఆటగాడిగా మరింత రాణించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని బౌచర్ తెలిపాడు. భారత జట్టుకు కెప్టెన్ కూడా అయిన రోహిత్‌ కు పనిభారం తగ్గించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బౌచర్‌ వివరించాడు.

ఈ వీడియోపై రోహిత్ శర్మ భార్య రితిక చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. స్మాష్ స్పోర్ట్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ బౌచర్ ఇంటర్వ్యూ వీడియోను అప్‌లోడ్ చేసింది. ఆ వీడియోకు రితిక రిప్లై ఇస్తూ, “ఇందులో చాలా విషయాలు తప్పు...” అని కామెంట్ చేసింది. 2013లో, రికీ పాంటింగ్ నుండి రోహిత్ ముంబై జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అక్కడి నుండి ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020లలో 5 టైటిళ్లను గెలుచుకుంది.

Next Story