గువాహటి వేదికగా మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే.. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. దీంతో అందరి మనసులు గెలుచుకున్నాడు.
ఏం జరిగిందంటే..?
ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను సీనియర్ పేసర్ మహమ్మద్ షమి వేశాడు. తొలి రెండు బంతుల్లో లంక కెప్టెన్ శనక రెండు పరుగులు చేశాడు. మూడో బంతికి సింగిల్ తీశాడు. నాలుగో బంతికి కసున్ రజత స్ట్రైకింగ్ కు రాగా.. అప్పటికి శనక స్కోర్ 98. దీంతో సింగిల్ తీసి ఇవ్వాలని రజితకు శనక సూచించాడు. భారత ఫీల్డర్లు అందరూ సర్కిల్ లోపలే ఫీల్డింగ్‌కు వచ్చారు. అయితే.. షమీ బంతి వేయక ముందే షనక క్రీజు దాటి వెళ్లాడు. దీన్ని గమనించిన షమీ మన్కడింగ్ పద్దతిలో రనౌట్ చేసి అప్పీల్ చేశాడు.
వెంటనే ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ ని సంప్రదించాడు. అయితే సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో శనక ఉండడంతో కెప్టెన్ రోహిత్ శర్మ వెంటనే జోక్యం చేసుకున్నాడు. షమితో మాట్లాడి రనౌట్ అప్పీల్‌ని వెనక్కి తీసుకున్నాడు. నాలుగో బంతికి ఓవర్‌తో కారణంగా ఐదు పరుగులు రాగా ఐదో బంతిని శనక బౌండరీకి తరలించి శతకాన్ని అందుకున్నాడు. కాగా.. ఇది శనక కెరీర్‌లో రెండో సెంచరీ.
రోహిత్ శర్మ చూపిన క్రీడా స్పూర్తిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.