టీ20 ప‌గ్గాలు రోహిత్‌కే.. కోహ్లీకి విశ్రాంతి

Rohit Sharma To Lead India In T20I Series Against New Zealand.అంద‌రూ ఊహించిన‌ట్లే భారత టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Nov 2021 3:03 AM GMT
టీ20 ప‌గ్గాలు రోహిత్‌కే.. కోహ్లీకి విశ్రాంతి

అంద‌రూ ఊహించిన‌ట్లే భారత టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌నే ఎంపిక చేశారు. టీ20 ప్ర‌పంచ క‌ప్ అనంత‌రం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవ‌డంతో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) రోహిత్‌కు ప‌గ్గాలు అప్ప‌గించింది. కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. న్యూజిలాండ‌తో స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌కోసం 16 మందితో కూడిన జ‌ట్టును బీసీసీఐ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. హిట్‌మ్యాన్ అందుబాటులో ఉన్న‌ప్పుడు కెప్టెన్‌గా మ‌రొక‌రి గురించి ఆలోచించే ప‌రిస్థితులు లేవ‌ని.. యువ ఆట‌గాడికి సార‌థ్యం అప్ప‌గించ‌నున్న‌ట్లు ఎవ‌రు ప్ర‌చారం చేశారో తెలియ‌ద‌ని.. ప్ర‌స్తుతం కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా చేశామ‌ని.. హిట్‌మ్యాన్ అందుబాటులో లేనప్పుడు అత‌డు జ‌ట్టును న‌డిపిస్తాడ‌ని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు.

ఈ నెల 17 నుంచి కివీస్ జ‌ట్టుతో భార‌త్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌కు సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, ర‌వీంద్ర జ‌డేజా, బుమ్రా, ష‌మీకి విశ్రాంతి నివ్వ‌గా.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో స‌త్తాచాటిన‌ రుతురాజ్ గైక్వాడ్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, వెంకటేశ్‌ అయ్యర్ ల‌కు చోటు ద‌క్కింది. స్పిన్న‌ర్ చాహ‌ల్‌, పేస‌ర్ సిరాజ్‌లతో పాటు శ్రేయస్‌ అయ్యర్, అక్ష‌ర్ ప‌టేల్‌ల‌కు మ‌ళ్లీ పిలుపు వ‌చ్చింది.

భార‌త జ‌ట్టు : రోహిత్‌ (కెప్టెన్‌), కే ఎల్ రాహుల్‌(వైస్ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌, సూర్యకుమార్‌, పంత్‌, ఇషాన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, చాహల్‌, అశ్విన్‌, అక్షర్‌, అవేశ్‌ ఖాన్‌, భువనేశ్వర్‌, దీపక్‌, హర్షల్‌ పటేల్‌, మహమ్మద్‌ సిరాజ్‌

టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..

నవంబర్ 17న‌ తొలి మ్యాచ్‌ (జైపూర్‌లో)

నవంబర్ 19న‌ రెండో మ్యాచ్‌ (రాంచీలో)

నవంబర్ 21న‌ మూడో మ్యాచ్‌ (కోల్‌కతాలో)

కెప్టెన్సీ కొత్తేమీ కాదు..

పొట్టి ఫార్మాట్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌కు కెప్టెన్సీ కొత్తేమీ కాదు. రోహిత్ కెప్టెన్సీలోనే ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఐదు సార్లు చాంఫియ‌న్‌గా నిలిచింది. ఇక విరాట్ గైర్హాజ‌రీలో ఇప్ప‌టి వ‌ర‌కు రోహిత్ శ‌ర్మ 19 మ్యాచ్‌ల్లో భార‌త టీ20 జ‌ట్టుకు తాత్కాలికంగా నాయ‌క‌త్వం వ‌హించాడు. అందులో టీమ్ఇండియా 15 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడించింది.

Next Story