వారందరినీ నోరు మూయించే వ్యాఖ్యలు చేసిన రోహిత్ శర్మ
Rohit Sharma Slams Pitch Critics. చెన్నై రెండో టెస్ట్ విమర్శలపై ఓపెనర్ రోహిత్ శర్మ స్పందించాడు.
By Medi Samrat Published on 22 Feb 2021 4:05 PM ISTచెన్నై రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఉపయోగించిన స్పిన్ పిచ్ పై ఇంగ్లాండ్ కు చెందిన మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే..! భారత జట్టు గెలవడం కోసం కావాలనే స్పిన్ పిచ్ ను తయారు చేశారని విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ విమర్శలపై ఓపెనర్ రోహిత్ శర్మ స్పందించాడు.
క్రికెట్ మ్యాచ్ లలో హోమ్ అడ్వాంటేజ్ అన్నది ఉంటుందని.. ప్రతి దేశం కూడా ఇలాగే పిచ్ లను తయారు చేస్తూ ఉంటాయని రోహిత్ శర్మ తెలిపారు. క్రికెట్ ఆడే ప్రతి దేశంలోనూ జరిగేదే భారత్ లోనూ జరుగుతుందని తెలిపాడు. ఇరు జట్లకూ పిచ్ ఒకటే. అసలీ చర్చ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఉపఖండంలోని పిచ్ లను ఇలానే తయారు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చేస్తున్నదేమీ లేదని రోహిత్ శర్మ వ్యాఖ్యలు చేశారు. ఏ దేశమైనా తమ ఆటగాళ్లకు, పరిస్థితులకు, బలాబలాలకు అనుగుణంగానే క్రికెట్ పిచ్ లను తయారు చేసుకుంటుందని, గతంలో ఏ దేశమైనా భారత ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకుని పిచ్ లను తయారు చేసిందా? అని రోహిత్ ప్రశ్నించాడు. వారు ఆలోచించకుంటే, మనమెందుకు ఆలోచించాలని రోహిత్ విమర్శించాడు. భారత్ విదేశాల్లో పర్యటిస్తున్న వేళ ఎన్నో సార్లు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఆటగాళ్లు బాగా ఆడితే ప్రతిభను, ఆడకుంటే పిచ్ లను నిందించడం విదేశీ మాజీలకు అలవాటేనని కౌంటర్ వేశాడు.
రెండో టెస్టు తరువాత మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, మార్క్ వా తదితరులు చెపాక్ పిచ్ పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల ఆట ఆడేందుకు ఈ పిచ్ పనికిరాదని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు.