ఓటమిపై రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?
Rohit sharma says something is missing in our batting line up.చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో శుక్రవారం రాత్రి
By తోట వంశీ కుమార్ Published on 24 April 2021 10:20 AM ISTచెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ (63; 52 బంతుల్లో 5 పోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించగా.. మిగిలిన వారు విఫలం కావడంతో ముంబై తక్కువ పరుగులకే పరిమితమైంది. అనంతరం 132 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 17.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్ (60 నాటౌట్; 52 బంతుల్లో 3పోర్లు, 3 సిక్సర్లు), క్రిస్ గేల్ (43 నాటౌట్; 35 బంతుల్లో 5పోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.
ఓటమి అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. 'పవర్ ప్లేలో ధాటిగా ఆడలేకపోవడం, కావాల్సిన పరుగులు చేయకపోవడమే తమ ఓటమికి కారణమన్నాడు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఏం లేదు. పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల విజయాన్ని చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఎప్పుడైనా 150-160 పరుగులు చేస్తే మ్యాచ్‌లో నిలవొచ్చు. గత రెండు మ్యాచ్‌లుగా ఈ విషయంలో మేం విఫలమయ్యాం. కావాల్సిన పరుగులు చేయలేకపోయాం. దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పవర్ ప్లేలో వారి బౌలింగ్ ఎక్స్‌లెంట్. ఇషాన్ కిషన్ భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు. నేను కూడా పవర్ ప్లేలో పరుగులు చేయలేకపోయా. మేం ప్రయత్నించినా వికెట్ చాలా నెమ్మదిగా ఉండటంతో సాధ్యం కాలేదు.' అని రోహిత్ శర్మ అన్నాడు.