కరోనా మహమ్మారి కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నేటి నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. పొట్టి ఫార్మాట్‌లో అరుదైన రికార్డును నెలకొల్పేందుకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో మూడు అడుగుల దూరంలో ఉన్నాడు.
మరో మూడు సిక్సర్లు బాదితే.. టీ 20 క్రికెట్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ 397 సిక్సర్లు బాదాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ పేరు మీద ఉంది. గేల్ ఏకంగా 1042 సిక్సర్లు బాదాడు. గేల్ తరువాతి స్థానాల్లో పోలార్డ్(755), ఆండ్రీ రసెల్(509) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో రోహిత్(397) ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు
ఇక భారత ఆటగాళ్ల విషయానికి వస్తే.. సురేశ్ రైనా (324 సిక్సర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (315), మాజీ సారథి ఎంఎస్ ధోనీ (303) తో ఉన్నారు. కాగా.. నేటి మ్యాచ్‌లో రోహిత్ ఆ రికార్డును అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పాయిట్ల పట్టికలో ముంబై నాలుగో స్థానంలో ఉంది.