మూడో వన్డేలో గెలిస్తే.. చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
Rohit Sharma one win away from making history.పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టిచేందుకు సిద్దమయ్యాడు.
By తోట వంశీ కుమార్ Published on 11 Feb 2022 1:11 PM ISTపరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టిచేందుకు సిద్దమయ్యాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలిచిన హిట్‌మ్యాన్ సేన నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఆఖరి వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని బావిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా టీమ్ఇండియా గెలిస్తే పలు రికార్డులు బద్దలుకానున్నాయి. దైపాక్షిక సిరీస్‌ల్లో వెస్టిండీస్‌పై వన్డే సిరీస్ వైట్‌వాష్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పనున్నాడు.
ఊరిస్తున్న పలు రికార్డులు..
- 2014లో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 5-0 తో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఆ తరువాత ఇప్పటి వరకు క్లీన్ స్వీప్ చేయలేదు. మరోసారి ఆ అవకాశం వచ్చింది.
- స్వదేశంలో ఒక జట్టును వైట్‌వాష్ చేసిన ఎనిమిదో కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలుస్తాడు. ఇంతకముందు కపిల్‌దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, అజింక్యా రహానేలు ఈ ఫీట్‌ను నమోదు చేశారు.
- స్వదేశంలో టీమ్ఇండియాకు 12వ వైట్‌వాష్ సిరీస్ విక్టరీ
- భారత గడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఇంగ్లండ్‌లు వైట్‌వాష్ అయ్యాయి. ఇక మూడో వన్డేలో ఓటమిపాలయ్యి వెస్టిండీస్ వైట్‌వాష్ అయితే ఈ జాబితాలో చేరనుంది.
- ఇక వెస్టిండీస్ ఇప్పటివరకు 19 వన్డే సిరీస్‌ల్లో వైట్‌వాష్ అయింది. ఈ రోజు కూడా ఓడితే ఆ సంఖ్య 20కి చేరనుంది.
ధోని ని అధిగమించే అవకాశం
ఇక బ్యాట్స్‌మెన్‌గానూ రోహిత్‌ను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఒక్క సిక్సర్ బాదితే.. స్వదేశంలో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలవనున్నాడు. ఈ జాబితాలో మాజీ సారధి ధోని 113 ఇన్నింగ్స్‌ల్లో 116 సిక్సర్లతో ముందు ఉన్నాడు. రోహిత్ 68 ఇన్నింగ్స్‌ల్లో 116 సిక్సర్లతో కొనసాగుతున్నాడు. ఒక్క సిక్స్ కొడితే ధోనిని అధిగమించనున్నాడు. ఒకవేళ ఐదు సిక్సర్లను కొడితే మాత్రం వన్డేల్లో 250 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు.