IPL: కెప్టెన్‌గా రోహిత్ తొలగింపు తర్వాత ముంబై ఇండియన్స్ ట్వీట్

ఇన్నాళ్లు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉండి ముందుకు నడిపించిన రోహిత్‌ను తప్పించింది ఆ టీమ్ మేనేజ్‌మెంట్.

By Srikanth Gundamalla  Published on  16 Dec 2023 6:00 AM GMT
rohit sharma, ipl-2024, mumbai indian, tweet,

 IPL: కెప్టెన్‌గా రోహిత్ తొలగింపు తర్వాత ముంబై ఇండియన్స్ ట్వీట్

భారత్‌లో క్రికెట్‌ అభిమానులు ఎక్కువగా ఉంటారు. టీమిండియా స్వదేశంలో మ్యాచ్‌లు ఆడుతుందంటే చాలు.. ఎగబడి టికెట్‌ రేట్లు ఎంతున్నా సరే అడ్జస్ట్‌ చేసుకుని మరీ మ్యాచ్‌ను లైవ్‌ చూస్తుంటారు. ఇక ఇండియాలో జరిగే ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మనదేశ ఆటగాళ్లే కాదు.. ఇంటర్నేషనల్‌ క్రికెటర్స్‌ ఇక్కడకు వచ్చి అదరగొడుతుంటారు. ఈ క్రమంలోనే ఆయా ఫ్రాంచైజీలకు సెపరేట్‌గా ఫ్యాన్‌ బేస్‌ ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ అంటే విజయాలకు కేరాఫ్‌ అని చెప్పాలి. ఈ టీమ్‌కు ఉన్న విన్నింగ్‌ పర్సంటేజ్ మరెవరికీ ఉండదు. అయితే.. ఇన్నాళ్లు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉండి ముందుకు నడిపించిన రోహిత్‌ను తప్పించింది ఆ టీమ్ మేనేజ్‌మెంట్.

కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగిస్తూ.. ఆ స్థానాన్ని హార్దిక్‌ పాండ్యాకు అప్పగించింది. ఈ నేపథ్యంలో పలువురు ఈ నిర్ణయంపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్‌ శర్మ ఫ్యాన్స్ అయితే.. ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్‌ ఇస్తున్నారు. చాలా వరకు ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్లను అన్‌ఫాలో చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఈ సందర్భంగా.. ముంబై ఇండియన్స్‌ ఒక ట్వీట్ చేసింది. జట్టుని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మ స్థానంలో పాండ్యాను నియమించిన ముంబై ఇండియన్స్ కీలక వ్యాఖ్యలు చేసింది. రోహిత్‌.. 2013లో నువ్వు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నావనీ ట్వీట్‌లో పేర్కొంది. అప్పుడు మేనేజ్‌మెంట్‌ను ఒకటే అడిగావు.. మా మీద నమ్మకం ఉంచండని చెప్పావు. గెలుపు అయినా.. ఓటమి అయినా సరే నవ్వుతూ ఉండాలని అని చెప్పావు. పదేళ్ల కెప్టెన్సీ కెరీర్‌లో ఆరు ట్రోఫీలు (ఐదుసార్లు ఐపీఎల్‌ విజేతగా, ఒకసారి ఛాంపియన్స్‌ లీగ్‌) సాధించావు. దిగ్గజాల నాయకత్వ వారసత్వాన్ని కొనసాగిస్తూ జట్టును ముందుండి నడిపించావు. ధన్యవాదాలు.. కెప్టెన్ రోహిత్ శర్మ’’ అని ముంబై ఇండియన్స్‌ ట్వీట్‌ చేసింది.

మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌ సేవలను చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా కొనియాడింది. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ ‘2013 నుంచి 2023.. దశాబ్దకాలంపాటు ఎన్నో సవాళ్లకు స్ఫూర్తిగా నిలిచావు. రోహిత్‌.. మీ మీద చాలా గౌరవం ఉంది’’ అనే క్యాప్షన్‌తో ధోనీ-రోహిత్‌ ఫొటోను చెన్నై సూపర్‌ కింగ్స్ షేర్‌ చేసింది.


Next Story