ముగ్గురు ముంబై.. ఇద్ద‌రు చెన్నై.. కోచ్ ఢిల్లీకి.. ఇళ్ల‌కు చేరుకున్న క్రికెట‌ర్లు..!

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన భారత ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్నారు.

By Medi Samrat  Published on  11 March 2025 10:10 AM IST
ముగ్గురు ముంబై.. ఇద్ద‌రు చెన్నై.. కోచ్ ఢిల్లీకి.. ఇళ్ల‌కు చేరుకున్న క్రికెట‌ర్లు..!

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన భారత ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమ్ కలిసి భారత్‌కు తిరిగి వచ్చింది.. అయితే ఈసారి జట్టు సభ్యులు వేర్వేరు నగరాల్లో అడుగుపెట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్ ముంబై విమానాశ్రయంలో కనిపించగా.. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెన్నైలో దిగారు. జ‌డేజా సీఎస్‌కే శిబిరంలో చేర‌నుండ‌గా.. వరుణ్ చెన్నైలోని ఇంటికి చేరుకున్న‌ట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ దుబాయ్ నుంచి ఢిల్లీ చేరుకున్నాడు. ఈ ఆటగాళ్లు ఇంటికి చేరుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగాడు. ఆయా ప్రాంతాల్లో ఆట‌గాళ్ల‌కు భారీ సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్ ముంబై విమానాశ్రయంలో కనిపించారు. అంతకుముందు కోచ్ గౌతం గంభీర్ ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు.

ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రవీంద్ర జడేజా భార్య రివాబా మాట్లాడుతూ.. భారత ప్రజల ప్రార్థనలు.. ఆశీర్వాదం వల్ల ఇది సాధ్యమైంది. భారత జట్టు ఆడిన తీరు, టోర్నీ మొత్తం మనం అజేయంగా నిలిచాం. ఆటగాళ్లందరూ మంచి ప్రదర్శన చేశారు. భవిష్యత్తులో కూడా జట్టు ఇలాంటి ప్రదర్శనను కొనసాగిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని వ్యాఖ్యానించింది

ఇదిలావుంటే.. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత్‌కు 252 పరుగుల విజయలక్ష్యాన్ని న్యూజిలాండ్ నిర్దేశించగా, భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే దానిని చేధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం భారత్‌ 49 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ కెప్టెన్‌ ఇన్నింగ్స్(76) ఆడాడు.

భారత్‌కు ఇది ఏడో ఐసీసీ ట్రోఫీ. ఇంతకుముందు జట్టు 1983, 2011 వన్డే ప్రపంచ కప్, 2007, 2024 T20 ప్రపంచ కప్.. 2002, 201, 2025ల‌లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

Next Story