ఐపీఎల్‌లో రోహిత్‌శర్మ అరుదైన రికార్డు
Rohit Sharma first to score 1000 runs against one team in IPL.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో హిట్‌మ్యాన్
By తోట వంశీ కుమార్ Published on 24 Sept 2021 12:51 PM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్‌లో ఒక జట్టుపై వెయ్యి(1000) పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. గురువారం అబుదాది వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతికి ఫోర్ బాదిన రోహిత్.. కేకేఆర్‌పై వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్నాడు. హిట్‌మ్యాన్ తరువాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ 943, 913 పరుగులతో(కేకేఆర్, పంజాబ్ కింగ్స్), విరాట్ కోహ్లి 909 పరుగులు(ఢిల్లీ క్యాపిటల్స్) వరుసగా ఉన్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ 30 బంతుల్లో 4 బౌండరీలతో 33 పరుగులు చేశాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో ముంబై వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. 156 లక్ష్యాన్ని కేకేఆర్ 15.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేదించింది.
ఈ మ్యాచ్‌లో ఓటమి అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. అప్పుడప్పుడు ఇలాంటి ఓటములు సహజమని అన్నాడు. కొన్ని చోట్ల తప్పులు చేశామని చెప్పాడు. అద్భుత ఆరంభం లభించినా.. భారీ స్కోర్‌గా మలచలేకపోయామని తెలిపారు. 'డికాక్, నేను శుభారంభం చేశాక మరిన్ని కీలక భాగస్వామ్యాలు నిర్మించాల్సింది పోయి వరుస వికెట్లు కోల్పోయాం. క్రీజులోకి రాగానే ఎవరైనా దంచి కొట్టడం అన్నది అంత తేలికకాదు. కానీ గత మ్యాచ్‌లోనూ ఇలాగే జరిగింది. దీని మీద దృష్టిసారిస్తామని' చెప్పుకొచ్చాడు. మిగతా మ్యాచ్‌ల్లో పోరాడి వరుస విజయాలు సాధిస్తామనే ధీమాని రోహిత్ వ్యక్తం చేశాడు.