టీ20ల్లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
Rohit Sharma becomes most successful T20I captain at home venues.టీమ్ఇండియా ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతుంది.
By తోట వంశీ కుమార్ Published on 27 Feb 2022 10:13 AM ISTటీమ్ఇండియా ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతుంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. గతేడాది టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల చేతిలో ఓటిమి పాలైన తరువాత.. వరుసగా 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ క్రమంలో ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్నికైవసం చేసుకుంది. శనివారం ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 విజయం సాధించడం ద్వారా కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో స్వదేశంలో అత్యధిక టీ20 విజయాలు సాధించిన కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. స్వదేశంలో రోహిత్ ఇప్పటి వరకు 17 టీ20 మ్యాచుల్లో టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. 16 మ్యాచుల్లో విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌లను(15 విజయాలు) లను రోహిత్ వెనక్కి నెట్టాడు. ఇక టీమ్ఇండియా మాజీ సారధులు విరాట్ కోహ్లీ(13), మహేంద్రసింగ్ ధోని(11) లను ఎప్పుడో అధిగమించాడు.
ఇక మొత్తంగా.. టీమ్ఇండియాకు రోహిత్ 27 టీ20 మ్యాచుల్లో సారథిగా బాధ్యతలు చేపట్టగా.. 23 మ్యాచుల్లో విజయాన్ని అందించాడు. అలాగే పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ వరుసగా మూడు సిరీస్‌ల్లో విజయాన్ని అందించాడు. కివీస్‌ను 3-0తో విండీస్ ను 3-0 వైట్ వాష్ చేసిన రోహిత్.. ఈ రోజు శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లోనూ గెలిస్తే వరుసగా మూడు సిరీస్‌ల్లో వైట్‌వాష్ చేసిన కెప్టెన్‌గా నిలవనున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ పథుమ్ నిషాంక (75; 11 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. చివర్లో కెప్టెన్ దసున్ షనక (19 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. వీరిద్దరి ధాటిగా ఆడడంతో ఆఖరి 5 ఓవర్లలో లంక 80 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, బుమ్రా, హర్షల్, చాహల్, జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు.
శ్రీలంక నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని భారత్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే అంటే.. 17.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. శ్రేయస్ అయ్యర్ (44 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టగా.. సంజూ శాంసన్ (25 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రవీంద్ర జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్) లు చెలరేగి ఆడారు. చాలా రోజుల తరువాత జట్టులో చోటు దక్కించుకున్న శాంసన్ తొలుత తడబడినా.. కుదురుకున్న తరువాత తనదైన శైలిలో బ్యాట్ ఝళిపించాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ(1), ఇషాన్ కిషన్(16) లు విఫలం అయ్యారు.