రోహిత్ శర్మ అరుదైన ఘనత.. విరాట్, ధోని, గంగూలీకి సాధ్యం కాలేదు
Rohit Sharma becomes 4th captain to hit hundred in all 3 formats.టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన
By తోట వంశీ కుమార్ Published on 10 Feb 2023 2:46 PM IST
టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు. నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో శతకం చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో శతకాలు బాదిన తొలి భారత్ కెప్టెన్‌గా, ఓవరాల్‌గా నాలుగో సారథిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు కాగా.. ఆ తరువాత దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజార్ లు ఈ ఘనతను అందుకున్నారు. తాజాగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ వీరి సరసన చేరాడు.
టీమ్ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వన్డేలు, టీ20ల్లో సెంచరీలు చేశాడు. తాజాగా ఆసీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా శతకం బాదడంతో భారత దిగ్గజ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీలకు సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే... ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమ్ఇండియాకు రెండో రోజు టీ విరామానికి 5 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 118, జడేజా 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత ఆధిక్యం 49 పరుగులుగా ఉంది.
ఛటేశ్వర్ పుజారా (7) , కోహ్లీ (12), సూర్యకుమార్ యాదవ్ (8)లు విఫలం కాగా.. అశ్విన్(23) ఫర్వాలేదనిపించాడు.