టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. రహానే, పుజారాలపై వేటు
Rohit Sharma Appointed Captain Of Indian Test Team.శ్రీలంకతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు భారత
By తోట వంశీ కుమార్ Published on 20 Feb 2022 2:26 AM GMTశ్రీలంకతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. అందరూ ఊహించినట్లుగానే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దీంతో మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక గత కొంత కాలంగా ఫేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సీనియర్ బ్యాట్స్‌మెన్లు రహానే, పుజారాలపై వేటు పడింది. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌తో పాటు ఆంధ్ర కుర్రాడు కేఎస్ భరత్‌కు కూడా చోటిచ్చారు.
శనివారం చేతన్ శర్మ సారథ్యంలో సమావేశమైన సెలక్షన్ కమిటీ శ్రీలంకతో టెస్టు సిరీస్‌తో పాటు దాని కన్న ముందు జరిగే మూడు టీ20 ల సిరీస్‌కు జట్టును ప్రకటించింది. సమావేశంలో రహానే, పుజారాల గురించి చాలా సేపు చర్చించినట్లు చేతన్ శర్మ తెలిపారు. లంక పర్యటనకు పరిగణించబోవట్లేదని వాళ్లకు చెప్పామని.. అయితే ఎప్పటికీ వాళ్లకి ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు. అందుకనే వాళ్లను రంజీల్లో ఆడాలని సూచించినట్లు చెప్పాడు. అంతేకాకుండా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో పాటు వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మలను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేయలేదన్నారు. ఇక గాయం కారణంగా కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్ లు ఈ సిరీస్‌కు మొత్తానికే దూరం అయ్యారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ తొలిసారి టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ స్టో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇప్పటి దాకా 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 196 వికెట్లు పడగొట్టాడు. అందులో 16 సార్లు అయిదు వికెట్లు, ఆరు సార్లు పది వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. భారత్, శ్రీలంక మధ్య మూడు టి20 మ్యాచ్‌లు ఈనెల 24, 26, 27వ తేదీల్లో జరగనుండగా.. మార్చి 4 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది.
టెస్టు జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), మయాంక్, ప్రియాంక్ పాంచల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, విహారి, గిల్, పంత్, కేఎస్ భరత్, అశ్విన్, జడేజా, జయంత్, కుల్దీప్, షమీ, సిరాజ్, ఉమేశ్, సౌరభ్ కుమార్.
టి20 జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), రుతురాజ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్, సిరాజ్, సామ్సన్, జడేజా, చహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్, అవేశ్ ఖాన్.