అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్, కోహ్లి.. ఈ రోజు అందుకునేనా..?
Rohit Sharma And Virat Kohli On The Cusp Of Achieving Another Milestone In T20Is.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ
By తోట వంశీ కుమార్ Published on 9 July 2022 3:08 PM ISTరోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ ఇద్దరూ టీమ్ఇండియా బ్యాటింగ్‌కు మూల స్తంభాలు. ఈ ఇద్దరూ తమ దైన శైలిలో ప్రత్యర్థులపై చెలరేగుతూ భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలను అందించారు. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువా..? ఎవరు తక్కువా..? అన్నది చెప్పడం చాలా కష్టం. ఇదిలా ఉంటే ఈ ఇద్దరిని ప్రస్తుతం ఓ రికార్డు ఊరిస్తోంది. వీరిద్దరు ఇప్పటి వరకు టి20 ఫార్మాట్‌లో చెరో 298 బౌండరీలు(ఫోర్లు) బాదారు.
నేడు బర్మింగ్‌హామ్ వేదికగా భారత్ రెండో టి20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ చెరో రెండు బౌండరీలు బాదితే టి20 ఫార్మాట్‌లో 300 ఫోర్ల మైలురాయిని చేరుకుంటారు. అయితే.. వీరిలో ఎవరు ముందుగా ఆ మైలురాయిని అందుకుంటారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఈ రికార్డు ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ పేరు మీద ఉంది. పాల్ స్టిర్లింగ్ 104 టీ20ల్లో 325 బౌండరీలు బాదాడు. ఇక నేటి మ్యాచ్‌లో ఎప్పటిలాగానే రోహిత్ ఓపెనర్‌గా రానుండగా, విరాట్ సైతం ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్‌లు ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండతో ఈ ఇద్దరిని ఆడించాలని మేనేజ్‌మెంట్ భావిస్తే ఇషాన్ కిషన్‌పై వేటు పడే అవకాశం ఉంది. అదే జరిగే రోహిత్ తో పాటు కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మూడు టి20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన టీమ్ఇండియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని బావిస్తోంది. అయితే.. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్ సమం చేయాలని ఇంగ్లాండ్ గట్టి పట్టుదలతో ఉంది.