రోహిత్-ధావన్ జోడి.. అరుదైన రికార్డుకు 6 పరుగుల దూరంలో
Rohit Sharma and Shikhar Dhawan 6 Runs Away From Emulating Sachin Tendulkar and Sourav Ganguly’s ODI Milestone
By తోట వంశీ కుమార్ Published on 12 July 2022 2:51 PM ISTపరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన జోడిల్లో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ జోడి ఒకటి. అయితే.. గత కొంతకాలంగా వీరిద్దరు కలిసి ఆడలేదు. ధావన్ తరచుగా గాయాల కారణంగా జట్టులో చోటు కోల్పోవడం, వన్డేల సంఖ్య కూడా తగ్గిపోవడం కూడా ఓ కారణం కావచ్చు. అయితే.. నేడు(మంగళవారం) ఇంగ్లాండ్ తో ఆరంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో మరోసారి ఈ జంట పరుగులు ప్రవాహాన్ని కొనసాగించాలని ఆరాటపడుతోంది. చాలా కాలం తరువాత శిఖర్ ధావన్, రోహిత్ తో కలిసి ఓపెనింగ్‌కి రానున్నాడు. ఈ జంట మరో 6 పరుగులు జోడిస్తే ఈ ఫార్మాట్‌లో 5వేల పరుగుల మైలురాయిని చేరనుంది. వన్డే ఓపెనింగ్ జంటలో 5000 పరుగులు చేసిన నాలుగో జోడిగా రికార్డులకు ఎక్కనుంది.
గబ్బర్-హిట్‌మ్యాన్ జోడి ఇప్పటి వరకు 111 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 4,994 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ జాబితాలో భారత్‌కే చెందిన దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ -సౌరవ్ గంగూలీ జోడి తొలి స్థానంలో ఉంది. లిటల్‌మాస్టర్-బెంగాల్ టైగర్ ల ద్వయం 136 ఇన్నింగ్స్‌ల్లో 6,609 పరుగులు జోడించింది. వీరి తరువాత ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనింగ్ జోడీ మాథ్యూ హేడెన్-ఆడమ్ గిల్‌క్రిస్ట్ (114 ఇన్నింగ్స్‌ల్లో 5472), విండీస్ లెజెండరీ ఓపెనింగ్ పెయిర్ గార్డన్ గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ (102 ఇన్నింగ్స్‌ల్లో 5150) ఉన్నారు. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్-ధావన్ జోడి 5 వేల పరుగుల మైలురాయిని అందుకుంటుందో లేదో చూడాలి.
ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత జట్టు నేడు ఓవల్ వేదికగా మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో నేడు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. పొట్టి ఫార్మాట్‌లో ఆడినట్లుగానే ఆడి వన్డే సిరీస్‌ను సైతం కైవసం చేసుకోవాలని రోహిత్ సేన ఆరాటపడుతోందగా.. వన్డే సిరీస్ గెలిచి పొట్టి సిరీస్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది.