ముగిసిన ఫెద‌ర‌ర్ శ‌కం.. క‌న్నీళ్లు పెట్టుకున్న నాద‌ల్‌

Roger Federer's last match is Doubles Loss with Rafael Nadal.టెన్నిస్ దిగ్గ‌జం, స్విస్ ఆట‌గాడు రోజ‌ర్ ఫెద‌ర‌ర్ శ‌కం ఇక ముగిసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sep 2022 7:15 AM GMT
ముగిసిన ఫెద‌ర‌ర్ శ‌కం.. క‌న్నీళ్లు పెట్టుకున్న నాద‌ల్‌

టెన్నిస్ దిగ్గ‌జం, స్విస్ ఆట‌గాడు రోజ‌ర్ ఫెద‌ర‌ర్ శ‌కం ఇక ముగిసింది. టెన్నిస్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఫెడెక్స్ త‌న చివ‌రి మ్యాచ్ ఆడేశాడు. శుక్ర‌వారం జరిగిన లేవ‌ర్ క‌ప్ డ‌బుల్స్ మ్యాచ్‌లో టీమ్ యూర‌ప్ త‌రుపున ఫెద‌ర‌ర్‌, నాద‌ల్.. టీమ్ వ‌ర‌ల్డ్ ప్రాన్సెస్ త‌రుపున‌ ప్రాన్సిస్ తియాఫో, జాక్ సాక్ త‌ల‌ప‌డ్డారు. అయితే.. ఈ మ్యాచ్‌లో 4-6,7-6(7-2),11-9 తేడాతో ఫెద‌ర‌ల్, నాద‌ల్ జోడి ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తో ఫెద‌ర‌ర్ ఫ్రొఫెన‌ల్ టెన్నిస్ కెరీర్ ముగిసింది.

ఫెద‌ర‌ర్ త‌న కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్స్ నెగ్గాడు. అందులో ఆస్ట్రేలియా ఓపెన్ ఆరుసార్లు, ఫ్రెంచ్ ఓపెన్ ఓసారి, ఎనిమిది సార్లు వింబుల్డ‌న్‌, ఐదుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. త‌న కెరీర్‌లో మొత్తంలో 1526 సింగిల్స్‌, 223 డ‌బుల్స్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా త‌న కెరీర్‌లో 103 టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు.

చివ‌రి మ్యాచ్ అనంత‌రం ఫెద‌ర‌ర్ తీవ్ర ఉద్వేగానికి గుర‌య్యాడు. క‌న్నీళ్ల‌ను ఆపుకోలేక‌పోయాడు. రోజర్ ప‌క్క‌నే కూర్చున్న నాద‌ల్ కూడా ఏడ్చేశాడు. చిర‌కాల‌ మిత్రుడు, ప్ర‌త్య‌ర్థి ఫెద‌ర‌ర్ రిటైర్ అవుతున్నాడ‌న్న విష‌యాన్ని దిగ‌మింగేందుకు నాద‌ల్ ప్ర‌య‌త్నించాడు. దీంతో కోర్టు ప్రాంగ‌ణ‌మంతా ఒక్క‌సారిగా ఉద్విగ్నంగా మారింది.

ఈ సుదీర్ఘ కెరీర్‌లో త‌న‌కు ఎల్లప్పుడూ అండ‌గా నిలిచినా త‌న భార్య మిర్కాను హ‌త్తుకుని ఫెద‌ర‌ర్ బావోద్వేగానికి గుర‌య్యారు. ఆమెకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను లేవ‌ర్ క‌ప్ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాలో పంచుకుని స్విస్ దిగ్గ‌జానికి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికింది.

ఇక ఫెద‌ర‌ల్‌, నాద‌ల్ ఫోటోల‌ను ఆస్ట్రేలియా ఓపెన్ త‌న ట్విట‌ర్ ఖాతాలో షేర్ చేసింది. భీక‌ర ప్ర‌త్య‌ర్థులు.. ఉత్త‌మ స‌హ‌చ‌రులు అంటూ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

నీలాంటి క్లాసిక్ ఆట‌గాడు మ‌ళ్లీ టెన్నిస్‌లో దొర‌క్క‌పోవ‌చ్చు.. మిస్ యూ ఫెడ్డీ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఫెద‌ర‌ర్-నాద‌ల్ ముఖాముఖిగా 40 సార్లు త‌ల‌ప‌డ‌గా 16 సార్లు ఫెద‌ర‌ర్ 24 సార్లు నాద‌ల్ విజ‌యాలు సాధించారు.

Next Story
Share it