భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎంపికయ్యాడు. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోని సభ్యుడైన బిన్నీ బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. ఆయన వయస్సు 67ఏళ్లు. మంగళవారం ముంబైలో జరిగిన ఏజీఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో రోజర్ బిన్నీ పేరును ప్రకటించారు. అధ్యక్ష పదవికి బిన్ని ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ ఆ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. కర్నాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న బిన్నీ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.
భారత జట్టు సీనియర్ సెలక్షన్ కమిటీలో బిన్నీ సభ్యుడిగా పనిచేశారు. ఆ సమయంలో సందీప్ పాటిల్ చైర్మెన్‌గా ఉన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలని గంగూలీకి ఆసక్తి ఉన్నప్పటికీ బీసీసీఐలోని పెద్దలు ఆయనకు వరుసగా రెండోసారి అవకాశం కల్పించేందుకు సుముఖంగా లేరు. ఐపీఎల్ చైర్మెన్‌గా ఉండేందుకు సౌరవ్‌కు అవకాశం ఇచ్చినా.. ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఐసీసీ చైర్మెన్ పదవికి గంగూలీ పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.