టీ 20ల్లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ స‌రికొత్త రికార్డు

Rizwan becomes first batter to score 2k T20 runs in a calendar year.టీ 20ల్లో పాకిస్థాన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌, వికెట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Dec 2021 5:28 AM GMT
టీ 20ల్లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ స‌రికొత్త రికార్డు

టీ 20ల్లో పాకిస్థాన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌, వికెట్ కీప‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. టీ20 ఫార్మాట్‌లో ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో 2 వేల ప‌రుగులు పూర్తి చేసిన తొలి ఆట‌గాడిగా రికార్డుల‌కెక్కాడు. గురువారం క‌రాచీ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్య‌చ్‌లో రిజ్వాన్ ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. ఒషానే థామ‌స్‌ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్‌లో రిజ్వాన్ తొలి బంతిని బౌండ‌రీకి త‌ర‌లించి టీ20ల్లో 2 వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ 10 పోర్లు, 3 సిక్స‌ర్లు బాది కేవ‌లం 45 బంతుల్లో 87 ప‌రుగులు సాధించాడు.

ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబ్ అజామ్ ఉన్నాడు. అత‌డు 1,779 ప‌రుగులు సాధించాడు. విండీస్ విధ్వంస‌క‌ర వీరుడు క్రిస్‌గేల్ 2015లో 1,665 ప‌రుగులు చేసి మూడో స్థానంలో కొన‌సాగుతుండ‌గా.. భార‌త టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 2016లో 1,614 ప‌రుగుల‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 207 ప‌రుగులు చేసింది. విండీస్ జ‌ట్టులో కెప్టెన్ పూర‌న్ 37 బంతుల్లో 64 ర‌న్స్ చేశాడు. ఓపెన‌ర్లు బ్రాండ‌న్ కింగ్ 43, బ్రూక్స్ 49, బ్రావో 34 ప‌రుగుల‌తో రాణించారు. అనంత‌రం 208 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని పాకిస్థాన్ జ‌ట్టు 18.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేదించింది. మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌కు తోడు పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ 79 ప‌రుగుల‌తో చెల‌రేగ‌గా.. చివ‌ర్లో ఆసీఫ్ అలీ కేవ‌లం 7 బంతుల్లో 2 పోర్లు, 2 సిక్స్‌లు దంచికొట్ట‌డంతో పాక్ విజ‌యం సాధించింది.

Next Story
Share it