Viral Video : అవుటయ్యాడన్న కోపంతో పంత్ ఏం చేశాడంటే..
IPL 2024లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. రాజస్థాన్ రాయల్స్ (RR vs DC) చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
By Medi Samrat
IPL 2024లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. రాజస్థాన్ రాయల్స్ (RR vs DC) చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. రాజస్థాన్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ రిషబ్ పంత్ కూడా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. పంత్‌కు శుభారంభం లభించినా పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాడు. తన వికెట్ కోల్పోయిన తర్వాత.. పంత్ కలత చెందడం.. అతని బ్యాట్‌ను గోడకేసి బలంగా బాదిన వీడియో వైరల్ అవుతుంది.
— IndiaCricket (@IndiaCrick18158) March 28, 2024
రిషబ్ పంత్ 25 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. పంత్.. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించాడు. రన్‌రేట్ పెరుగుతున్న క్రమంలో ఒక పెద్ద షాట్‌ను కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే, బంతి పంత్ బ్యాట్ లోపలి అంచుని తీసుకొని సంజూ శాంసన్ చేతిలో పడింది. ఈ క్రమంలో తన వికెట్‌ను కోల్పోయిన తర్వాత పంత్ అసంతృప్తిగా కనిపించాడు. పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా.. అతను తన బ్యాట్‌ను గోడకు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ బ్యాట్‌తో రచ్చ సృష్టించాడు. వార్నర్ 34 బంతుల్లో 49 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అవేశ్ ఖాన్ వేసిన బంతికి సందీప్ శర్మకు క్యాచ్ ఇచ్చి అర్ధ సెంచరీ పూర్తి చేసుకోలేక నిష్క్రమించాడు. చివరి ఓవర్లలో స్టబ్స్ కేవలం 23 బంతుల్లో 44 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.. కానీ అతను ఢిల్లీని విజయపథంలో నడిపించలేకపోయాడు. ఆఖరి ఓవర్లో జట్టుకు 17 పరుగులు అవసరం కాగా.. అవేశ్ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో స్టబ్స్, అక్షర్ జోడీ 4 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ ఓటమి పాలయ్యింది.