నో బాల్ రాద్ధాంతం.. పంత్‌కు భారీ షాక్.. కోచ్ ఆమ్రేపై మ్యాచ్ నిషేధం
Rishabh Pant Shardul Thakur and Pravin Amre fined for Code Of Conduct breach.మూలిగే నక్కపై తాటిపండు పడట్లు అన్న
By తోట వంశీ కుమార్ Published on 23 April 2022 2:19 PM ISTమూలిగే నక్కపై తాటిపండు పడట్లు అన్నచందంగా తయారైంది ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి. ఓ వైపు జట్టులో కరోనా కలకలం మరో వైపు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో సతమతమవుతున్న జట్టుకు ఐపీఎల్ నిర్వాహకులు గట్టి షాకిచ్చారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నో బాల్ విషయంలో అంపైర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు జరిమానా పడింది. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఫీల్డ్‌లో ఉన్న ఆటగాళ్లను వెనక్కి రమ్మనందుకు పంత్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది.
ఇక పంత్‌కు మద్దతుగా నిలిచిన శార్దూల్ ఠాకూర్, అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేలపై చర్యలు తీసుకుంది. శార్దూల్ ఠాకూర్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించగా.. మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు గాను ప్రవీణ్ ఆమ్రేపై 100 శాతం జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిబంధనలను అతిక్రమించినందుకు ఈ ముగ్గురి పై చర్యలు తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరి డేనియల్ మనోహర్ తెలిపారు. ఇక పంత్, శార్దూల్ తమ తప్పులను అంగీకరించినట్లు చెప్పారు.
అసలేం జరిగిందంటే..
రాజస్థాన్ నిర్ధేశించిన 223 పరుగుల ఛేదనలో ఢిల్లీ విజయం సాధించాలంటే ఆఖరి ఓవర్‌లో ౬ బంతులకు 36 పరుగులు కావాలి. మెకాయ్ వేసిన ఆఖరి ఓవర్ తొలి మూడు బంతులను పావెల్ సిక్సర్లుగా మలిచాడు. దీంతో విజయ సమీకరణం 3 బంతుల్లో 18గా మారింది. అయితే.. మూడో బంతి బ్యాట్స్‌మెన్ నడుము కంటే కాస్త ఎత్తుగా వెళ్లినట్లు కనిపించింది. ఈ బంతిని నోబాల్ గా ప్రకటించాలని ఢిల్లీ ఆటగాళ్లు గొడవకు దిగారు. డగౌట్ నుంచి రిషబ్ పంత్ అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ దశలో తమ బ్యాట్స్‌మెన్లను మైదానంలోంచి బయటకు వచ్చేయాలని సైగలు చేశాడు. ఆ జట్టు సహాయక కోచ్ ఆమ్రె మైదానంలోకి వచ్చాడు. అంపైర్ అతడికి సర్ది చెప్పడంతో మ్యాచ్ కొనసాగింది. ఈ సమయంలో పావెల్ ఏకాగ్రత చెదిరింది. మిగిలిన మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే రావడంతో రాజస్థాన్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.