యానిమల్ సినిమాలోని ఆ సూప‌ర్‌ హిట్‌ పాట పాడుతూ బ్యాటింగ్ చేసిన పంత్‌..!

వీరూ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాటలు హమ్ చేస్తూ బౌలర్లను చీల్చిచెండాడుతూ ఫోర్లు, సిక్సర్లు బాదేవాడు.

By Medi Samrat  Published on  25 April 2024 7:30 PM IST
యానిమల్ సినిమాలోని ఆ సూప‌ర్‌ హిట్‌ పాట పాడుతూ బ్యాటింగ్ చేసిన పంత్‌..!

వీరూ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాటలు హమ్ చేస్తూ బౌలర్లను చీల్చిచెండాడుతూ ఫోర్లు, సిక్సర్లు బాదేవాడు. వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ విషయంలోనూ అలాంటి విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంత్ బ్లాక్ బస్టర్ హిట్ యానిమల్ చిత్రంలోని 'సత్రాంగ' పాటను హమ్ చేస్తున్నాడని వెల్లడించాడు.

అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ గుజరాత్ బౌలర్లను చిత్తు చేసి కేవలం 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 88 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ కూడా తన IPL కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు, 43 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 66 పరుగులు చేశాడు. వీరిద్దరి అద్భుతమైన ఇన్నింగ్స్‌ల‌తో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోరు చేసింది.

IPL అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక వీడియో షేర్ చేయ‌గా.. దీనిలో అక్షర్ పటేల్ మ్యాచ్ గురించి మాట్లాడటం కనిపించింది. ఈ సమయంలో అక్షర్ పటేల్.. రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అరిజిత్ సింగ్ పాటను హమ్ చేస్తున్నాడని వెల్లడించాడు. 26 ఏళ్ల పంత్ తన జోన్‌లో ఉన్నాడని, బ్యాటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఒత్తిడి తీసుకోకూడద‌ని అక్షర్ చెప్పాడు. టైమ్-అవుట్ తర్వాత పంత్ బ్యాటింగ్ చేసిన విధానం.. నేను హిట్టింగ్‌లో విజయం సాధించడంతో మేము భారీ స్కోరును చేరుకోగలిగామన్నాడు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ 224/4 స్కోరుకు సమాధానంగా గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేయగలిగింది. ఈ విజయంతో ప్లేఆఫ్‌కు చేరుకోవాలన్న ఢిల్లీ ఆశలు సజీవంగా ఉన్నాయి. 9 మ్యాచ్‌ల్లో ఢిల్లీకి ఇది నాలుగో విజయం కాగా పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు 9 మ్యాచ్‌ల్లో ఐదు ఓటములతో ఏడో స్థానంలో ఉంది.

Next Story