డబ్బు కోసం నేను ఢిల్లీ కేపిటల్స్‌ను వీడలేదు : రిషబ్ పంత్
రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వీడడానికి కారణం డబ్బు కాదంటూ తేల్చి చెప్పాడు.
By Medi Samrat Published on 19 Nov 2024 5:01 PM ISTరిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వీడడానికి కారణం డబ్బు కాదంటూ తేల్చి చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారకర్తలు పోస్ట్ చేసిన వీడియోపై పంత్ స్పందించాడు. ఆ పోస్టులో సునీల్ గవాస్కర్ IPL 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ తమ కెప్టెన్‌ను ఎందుకు కొనసాగించలేదో వివరించడానికి ప్రయత్నించారు.
ఈ వీడియోలో వికెట్ కీపర్-బ్యాటర్ డబ్బుకు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్- రిషబ్ పంత్ మధ్య విభేధాలు వచ్చి ఉండవచ్చని గవాస్కర్ తెలిపారు. నవంబర్ 24 - 25 తేదీల్లో జరగనున్న మెగా వేలంలో క్యాపిటల్స్ పంత్‌ను తిరిగి కొనుగోలు చేయాలని చూస్తుందని కూడా అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అక్షర్ పటేల్‌కు రూ. 16.5 కోట్లు, కుల్దీప్ యాదవ్‌ను రూ. 13.5 కోట్లు, దక్షిణాఫ్రికా స్టార్ ట్రిస్టన్ స్టబ్స్‌కు రూ. 10 కోట్లు చెల్లించారు. అన్‌క్యాప్డ్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ ను రూ. 4 కోట్లకు అట్టిపెట్టుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఆటగాళ్లలో ఎవరికీ 18 కోట్ల రూపాయలను చెల్లించలేదు. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (విరాట్ కోహ్లీకి రూ. 21 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (హెన్రిచ్ క్లాసెన్‌కు రూ. 23 కోట్లు) వంటి జట్లు తమ మొదటి ఎంపిక ఆటగాడికి నిర్ణయించిన ధర కంటే ఎక్కువ చెల్లించాయి.