భారత్‌కు దెబ్బ మీద దెబ్బ.. గాయపడ్డ పంత్, జడేజా
Rishabh Pant and Ravindra Jadeja Taken For Scans in Sydney.ఆసీస్ పర్యటనలో టీమ్ఇండియాను గాయాల బెడద వేదిస్తోంది. దెబ్బ మీద దెబ్బ.. గాయపడ్డ పంత్, జడేజా.
By తోట వంశీ కుమార్
ఆసీస్ పర్యటనలో టీమ్ఇండియాను గాయాల బెడద వేదిస్తోంది. ఇప్పటికే కీలక ఆటగాళ్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ గాయపడడంతో సిరీస్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. తాజాగా సిడ్ని వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్లు రిషబ్‌పంత్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయపడ్డారు. పంత్ మోచేతికి గాయం కాగా, జడేజా ఎడమ చేతి వేలికి గాయమైంది. కమిన్స్ బౌలింగ్‌లో పంత్ ఎడమ మోచేతికి బంతి బలంగా తగిలింది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడు. వెంటనే ఫిజియో మైదానంలో వచ్చి చికిత్స అందించాడు. ఆ తరువాత గాయంతోనే బ్యాటింగ్ కొనసాగించిన పంత్ కొద్దిసేపటికే హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్లిప్‌లో డేవిడ్ వార్నర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివర్లో జడేజా సైతం ధాటిగా ఆడుతూ గాయపడ్డాడు. అతడి ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. అయినా అలాగే బ్యాటింగ్ చేశాడు.
జడేజా, పంత్‌లు ఇద్దరూ గాయపడటంతో వీరిద్దరూ ఫీల్డింగ్ చేయడానికి రాలేదు. పంత్ స్థానంలో సాహా రాగా జడేజా స్థానంలో మయాంక్ అగర్వాల్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాడు. వీరిద్దరిని వైద్య పరీక్షలు చేయించడానికి ఆస్పత్రికి తరలించినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. వైద్యులు పరీక్షించిన తరువాతే గాయం తీవ్రతపై స్పష్టత రానుంది. ఒకవేళ గాయాలు మరీ పెద్దవై ఈ ఇద్దరూ సిరీస్ నుంచి దూరం అయితే.. భారత జట్టు కష్టాలు రెట్టింపు కానున్నాయి. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 244 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆసీస్ కు 94 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుంటే.. 197 పరుగుల ముందంజలో కొనసాగుతోంది. లబుషేన్ (47), స్మిత్(29) క్రీజులో ఉన్నారు.