పేద క్రికెటర్ల కోసం.. హాస్టల్‌ నిర్మిస్తోన్న రింకూసింగ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌).. ద్వారా ఎంతో మంది ప్రతిభావంత క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు.

By అంజి  Published on  18 April 2023 10:09 AM IST
Rinku Singh, Underprivileged Cricketers, IPL, KKR

పేద క్రికెటర్ల కోసం.. హాస్టల్‌ నిర్మిస్తోన్న రింకూసింగ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌).. ద్వారా ఎంతో మంది ప్రతిభావంత క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. వారి క్రికెట్‌ రికార్డులు.. వారిని హీరోలను చేశాయి. అది వారి జీవితాన్ని పైస్థాయిలో నిలబెట్టింది. అలాంటి తాజా సంచలనమే రింకూ సింగ్. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) తరఫున తనదైన శైలిలో ఆడుతూ, అదరగొడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అతడి ఎదుగుదలకు పేదరికం సైతం తలొంచింది. యూపీకి చెందిన 25 ఏళ్ల రింకూ సింగ్‌.. ఇప్పుడిప్పుడే ఫైనాన్షియల్‌గా సెటిల్‌ అవుతున్నాడు. ఐపీఎల్‌లో భారీగా డబ్బులు సంపాదిస్తున్న ఆటగాడు కాకపోయినా.. తనలాగే డ్రీమ్స్‌ సాకారం చేసుకోవాలనుకుంటున్న వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రస్తుత క్రికెటర్ల కోసం అలీగఢ్‌లో రూ.50 లక్షలు వెచ్చించి హాస్టల్‌ నిర్మిస్తున్నాడు.

ఆర్థికంగా వెనుకబడి ఉన్న యువ క్రికెటర్ల కోసం హాస్టల్‌ నిర్మించాలని రింకూ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడని, అది ఇప్పుడు నెరవేరుతోందని అలీగఢ్‌కు చెందిన రింకూ చిన్నప్పటి కోచ్‌ జాఫర్‌ తెలిపారు. జిల్లా క్రికెట్‌ సంఘానికి చెందిన 15 ఎకరాల స్థలంలో అలీగఢ్‌ క్రికెట్‌ స్కూల్‌, అకాడమీ జాఫర్‌ నడిపిస్తున్నాడు. ఇప్పుడు రింకూ కూడా అదే స్థలంలో హాస్టల్‌ను నిర్మిస్తున్నాడు. మొత్తం 14 గదులతో నిర్మిస్తున్న హాస్టల్‌ పనులు.. మూడ నెలల కిందటే మొదలయ్యాయి. ఒక్కో గదిలో నలుగురు ట్రైనీలు ఉండేలా హాస్టల్‌ నిర్మాణం జరుగుతోంది. ట్రైనీలు హాస్టల్‌లోని క్యాంటీన్‌లోనే ఆహారం తినొచ్చు. మరో నెల రోజుల్లో హాస్టల్‌ నిర్మాణం పూర్తవనుంది. ఆ తర్వాత రింకూ దీన్ని ప్రారంభించనున్నాడు. కోల్‌కతా 2018లో రింకూను రూ.80 లక్షలకు కొనుక్కుంది. అప్పటి నుంచి అతడు ఆ జట్టు తరఫునే ఆడుతున్నాడు.

Next Story