తగ్గేదేలే అంటున్న జడేజా.. వీడియో వైరల్
Ravindra Jadeja shares a video of him imitating Allu Arjun Dialogue.సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి
By తోట వంశీ కుమార్ Published on 24 Dec 2021 1:09 PM ISTసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజలే కాదు.. ఆటగాళ్లు కూడా తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. పాటలకు తగ్గట్లుగా డ్యాన్స్ చేస్తూ.. సినిమా డైలాగ్‌లు చెబుతున్నారు. బాష, సినిమాతో సంబంధం లేకుండా.. తమ టాలెంట్‌ను చూపించేస్తున్నారు. తాము కేవలం ఆటల్లోనే కాదు మిగతా వాటిలోనూ ముందుంటామని చెప్పకనే చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగు భాషపై ఎక్కువగా మనసు పారేసుకుంటున్నారు. తెలుగు సినిమాల్లోని డైలాగులు చెబుతూ అలరిస్తున్నారు.
ఈ వరుసలో అందరి కంటే ముందు వరుసలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. గతంలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరుపున ఆడిన వార్నర్.. పలు తెలుగు సినిమాల్లోని పాటలకు తన సతీమణితో కలిసి డ్యాన్స్ చేయగా.. తాజాగా టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం తానేం తక్కువ కాదని అంటున్నాడు. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన 'పుష్ప' చిత్రంలోని పాపులర్ డైలాగ్ 'తగ్గేదేలే..' ని తనదైన రీతిలో ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ దుమ్ములేపాడు.
అచ్చు బన్నీ తరహాలోనే మాసిన గడ్డం చెరిగిన జట్టుతో కనిపించిన జడ్డూ 'పుష్పా.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే' అంటూ చేతిని గడ్డం కింది నుంచి పోనిస్తూ.. చెప్పిన డైలాగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్పందిస్తూ.. 'తర్వాతి చిత్రం కోసం వేచి చూస్తున్నా' అంటూ ఏడుస్తున్న ఎమోజీలతో సరదాగా జవాబిచ్చాడు. కాగా.. గాయం కారణంగా జడేజా సౌతాఫ్రికా పర్యటనకు దూరం అయిన సంగతి తెలిసిందే.