కెప్టెన్‌గా రషీద్‌ ఖాన్‌

Rashid Khan Appointed Afghanistan T20 Captain.అఫ్ఘానిస్థాన్‌ టీ20 కెప్టెన్‌గా స్టార్ లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 July 2021 6:02 AM GMT
కెప్టెన్‌గా రషీద్‌ ఖాన్‌

అఫ్ఘానిస్థాన్‌ టీ20 కెప్టెన్‌గా స్టార్ లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఎంపికయ్యాడు. 2021 టీ20 ప్రపంచకప్​ను దృష్టిలో ఉంచుకుని రషీద్​ను కెప్టెన్​గా నియమించినట్టు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఇక వ‌న్డే, టెస్టు జట్టు ప‌గ్గాల‌ను హ‌స్మ‌తుల్లా షాహిదికి అప్ప‌గించారు. టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్-బిలో అఫ్గానిస్థాన్ ఉండగా.. ఆ గ్రూప్‌లో భారత్, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా వంటి బ‌ల‌మైన జ‌ట్లు ఉన్నాయి.

'ఎన్నో ఏళ్లుగా రషీద్‌ ఖాన్‌కి ఉన్న అనుభవం, అద్భుత ప్రదర్శన, నాయకత్వ లక్షణాలను దృష్టిలో ఉంచుకుని అతడికి అఫ్ఘానిస్థాన్‌ టీ20 బాధ్యతలు అప్పగించాం. టీ20 ప్రపంచకప్​ను దృష్టిలో ఉంచుకుని రషీద్​ను కెప్టెన్​గా నియమించాం. అతడు రాణిస్తాడనే నమ్మకం ఉంది. ప్రపంచకప్​లో అఫ్ఘానిస్థాన్‌ మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాం' అని ఏసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. రషీద్ అఫ్ఘానిస్థాన్‌ తరఫున 5 టెస్టులు, 74 వన్డేలు, 51 టీ20లు ఆడాడు.

Advertisement

నిజానికి 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత రషీద్ ఖాన్‌ని మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు నియమించింది. అతని కెప్టెన్సీలో 16 వన్డేలాడిన అఫ్గానిస్థాన్.. ఆరింటిలో విజయం సాధించింది. అయితే..కొన్ని కార‌ణాల‌తో రషీద్ ఖాన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి అస్గర్ అఫ్గాన్‌ని కెప్టెన్‌గా నియమించింది. అత‌డి సార‌థ్యంలో కూడా జ‌ట్టు చెప్పుకోద‌గ్గ విజ‌యాలు సాధించ‌లేదు. ఈ ఏడాది ఆరంభంలో అత‌డు మూడు ఫార్మ‌ట్ల‌కు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు. టీ20 పగ్గాలు అందుకునేందుకు తొలుత నిరాకరించిన రషీద్ ఖాన్.. ఎట్టకేలకి బోర్డు పెద్దల జోక్యంతో ఓకే చెప్పాడు.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో ఆడుతున్న రషీద్.. ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ టాప్-2లో ఉన్నాడు. ఐపీఎల్‌ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున గత కొన్నేళ్లుగా ఆడుతున్న రషీద్ ఎంతో పేరు సంపాదించాడు.

Next Story
Share it