త్యాగి సంచలన బౌలింగ్.. రాజస్థాన్ అనూహ్య విజయం
Rajasthan Royals beat Punjab Kings by 2 runs.పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అనూహ్య
By తోట వంశీ కుమార్ Published on 22 Sept 2021 8:21 AM ISTపంజాబ్ కింగ్స్ ఎలెవెన్ తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఆఖరి ఓవర్‌లో త్యాగి సంచలన బౌలింగ్ చేయడంతో పంజాబ్‌కు భంగపాటు తప్పలేదు. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్‌లో నాలుగు పరుగులు అవసరం కాగా.. కేవలం ఒకే పరుగు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌కు అనూహ్య విజయాన్ని అందించాడు త్యాగి.
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మయాంక్ అగర్వాల్ (43 బంతుల్లో 67; 7 ఫోర్లు 2 సిక్సర్లు) లు అద్భుత ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 120 పరుగులు జోడించారు. ముఖ్యంగా మయాంక్ అగర్వాల్ చూడచక్కని షాట్లతో అలరించాడు. రాహుల్ తొలుత తడబడినప్పటికి మయాంక్‌కు చక్కని సహకారం అందిస్తూ.. సమయోచితంగా షాట్లు ఆడాడు. రాజస్థాన్ పేలవ ఫీల్డింగ్ కూడా పంజాబ్‌కు కలిసి వచ్చింది. కేఎల్ రాహుల్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను నేలపాలు చేశారు. మోరిస్ వేసిన పదో ఓవర్లో పంజాబ్ 25 పరుగులు పిండుకుంది. ఎట్టకేలకు ఆరు పరుగుల వ్యవధిలో వీరిద్దరిని ఔట్ చేసి రాయల్స్ కాస్త ఊపిరి పీల్చు కుంది. అయితే.. పూరన్ (22 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్సర్లు), మార్క్‌రమ్ (20 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి జట్టును విజయానికి చేరువ చేశారు.
త్యాగి అద్భుత బౌలింగ్
19 ఓవర్లు పూర్తి అయ్యే సరికి పంజాబ్ స్కోర్ 182/2. అప్పటికే నిలదొక్కుకున్న పూరన్, మార్క్‌రమ్ క్రీజులో ఉన్నారు. 6 బంతుల్లో 4 పరుగులు చేయాలి. విజయం పంజాబ్‌దే అని అందరూ డిసైడ్ అయ్యారు. కెప్టెన్ సంజు.. త్యాగికి బంతిని ఇచ్చాడు. తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి సింగిల్. మూడో బంతికి పూరన్ ఔట్. అయినప్పటికి పంజాబ్‌కు ఇబ్బంది ఏమీ లేదు. 3 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేయాలి. అయితే.. నాలుగే బంతికి పరుగు రాలేదు. ఐదో బంతికి వికెట్. అందరిలోనూ నరాలు తెగె ఉత్కంఠ పెరిగిపోయింది. ఆరో బంతిని అద్భుతంగా బౌలింగ్ చేసిన త్యాగి పరుగు ఇవ్వలేదు. దీంతో రాజస్థాన్ రెండు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది.
లోమ్రోర్ మెరుపులు..
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే.. కనీసం 210 నుంచి 220 పరుగులు చేసేలా కనిపించింది. ఓపెనర్లు యశస్వి (36 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎవిన్ లూయిస్ (21 బంతుల్లో 36; 7 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుతో రాయల్స్ స్కోరు 5 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. ఈ దశలో పంజాబ్ బౌలర్లు పుంజుకుని స్వల్ప వ్యవధిలో లూయిస్‌తో పాటు శాంసన్(4)ను ఔట్ చేశారు. అయినప్పటికి యశస్వి తన దూకుడును కొనసాగించారు. అతడికి లివింగ్‌స్టోన్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) చక్కని సహాకారం అందించాడు. దీంతో రాజస్థాన్ 11 ఓవర్లకే 100 పరుగులు దాటింది. మరోసారి పుంజుకున్న పంజాబ్ బౌలర్లు వీరిద్దరిని స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చారు. అయితే.. మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. దీంతో 16 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ స్కోర్ 164/4. ఆ సమయంలో 200 పరుగులు ఈజీగా దాటేలా కనిపించింది. అయితే.. చివరి నాలుగు ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన పంజాబ్ బౌలర్లు కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి మిగిలిన 6 వికెట్లు పడగొట్టడంతో రాజస్థాన్ ఓ మోస్తారు లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది.