బట్లర్ బాదేశాడు.. వరుసగా రెండో శతకం.. సీజన్‌లో మూడోది
Rajasthan Royals 15 run win over Delhi Capitals.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇంగ్లాండ్ ఆటగాడు
By తోట వంశీ కుమార్ Published on 23 April 2022 8:38 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ అసాధారణంగా చెలరేగిపోతున్నాడు. శతకాల మోత మోగిస్తున్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. దీంతో ఈ సీజన్‌లో ఏడు మ్యాచులు ఆడిన బట్లర్ మూడు శతకాలను బాదడం విశేషం. బట్లర్ సునామీకి పడిక్కల్, శాంసన్ మెరుపులు తోడవడంతో రాజస్థాన్ 15 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్( 116; 65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లు) శతకానికి తోడు దేవదత్ పడిక్కల్ (54; 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజు శాంసన్ (46 నాటౌట్; 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు తోడవడంతో రాజస్థాన్ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. బట్లరు, పడిక్కల్ లు పోటీ పడి మరీ బౌండరీలు బాదారు. పడిక్కల్ ఔటైన తరువాత ఢిల్లీ బౌలర్లకు ఊరట లభించలేదు. అగ్నికి వాయువు తోడు అయినట్లు.. బట్లర్‌కు సంజు శాంసన్ తోడు అయ్యాడు. వీరిద్దరి వీర బాదుడుతో రాజస్థాన్ చివరి నాలుగు ఓవర్లలో 55 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముస్తఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 207 పరుగులు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ (44; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), పృథ్వీ షా (37; 27 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్), లలిత్ యాదవ్ (37; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రావ్‌మన్ పావెల్ (36; 15 బంతుల్లో 5 సిక్సర్లు) ఢిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు, అశ్విన్ రెండు, చాహల్ ఓ వికెట్ పడగొట్టాడు. బట్లర్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'అవార్డు దక్కింది.
ఆఖరిలో ఉత్కంఠ
బౌల్ట్ వేసిన 18 ఓవర్‌లో చివరి మూడు బంతుల్లో రెండు సిక్సర్లు బాది ఢిల్లీని రేసులోకి తెచ్చాడు పావెల్. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం 12 బంతుల్లో 36 పరుగులు చేయాలి. క్రీజులో అప్పటికే కుదురుకున్న లలిత్‌కు తోడు పావెల్ ఉండడంతో ఢిల్లీ విజయం లాంఛనమే అనిపించింది. అయితే.. 19 ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతం చేశాడు. ఒక్క పరుగు ఇవ్వకుండా లలిత్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్‌లో 36 పరుగులు కావాలి. అయితే.. ఈ దశలో పావెల్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మెకాయ్ వేసిన తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చేశాడు. దీంతో విజయ సమీకరణం 3 బంతుల్లో 18గా మారింది.
అయితే.. మూడో బంతి నోబాల్‌గా కనిపించినా అంపైర్ ఇవ్వలేదు. దీనిపై కాసేపు గొడవ జరిగింది. డగౌట్ నుంచి రిషబ్ పంత్ అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ దశలో తమ బ్యాట్స్‌మెన్లను మైదానంలోంచి బయటకు వచ్చేయాలని సైగలు చేశాడు. ఆ జట్టు సహాయక కోచ్ ఆమ్రె మైదానంలోకి వచ్చాడు. అంపైర్ అతడికి సర్ది చెప్పడంతో మ్యాచ్ కొనసాగింది. ఈ సమయంలో పావెల్ ఏకాగ్రత చెదిరింది. మిగిలిన మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే రావడంతో రాజస్థాన్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం ఈ అంశంపై స్పందించిన పంత్.. అంపైరింగ్ ప్రమాణాలు మెరుగు పడాల్సిన అవసరముందని తెలిపాడు.