రాణించిన రియాన్ పరాగ్.. బెంగళూరుపై రాజస్థాన్ విజయం
Rajasthan defeat Bangalore by 29 runs.బట్లర్ బాదకున్నా, బౌల్ట్ బెంబేలెత్తించకపోయినా రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపింది
By తోట వంశీ కుమార్ Published on 27 April 2022 3:41 AM GMT
బట్లర్ బాదకున్నా, బౌల్ట్ బెంబేలెత్తించకపోయినా రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపింది. వరుసగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. బ్యాటింగ్‌లో రియాన్ పరాగ్, బౌలింగ్‌లో కుల్‌దీప్ సేన్, రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటడంతో బెంగళూరును 29 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. ప్రస్తుత సీజన్‌లో మూడు సెంచరీలతో భీకర ఫామ్‌లో ఉన్న బట్లర్(8)తో పాటు దేవదత్ పడిక్కల్(7), కెప్టెన్ సంజు శాంసన్(27), హెట్ మయర్(3), అశ్విన్(17), మిచెల్(16) లు పరుగులు చేసేందుకు తీవ్ర ఇబ్బంది పడిన చోట యువ ఆటగాడు రియాన్ పరాగ్( 56 నాటౌట్; 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో రాజస్థాన్ జట్టు పోరాడే స్కోర్‌ను చేసింది. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, జోష్ హజిల్‌వుడ్, హసరంగా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఓ మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అవతారమెత్తిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (9) మరోసారి నిరాశ పర్చగా.. డుప్లెసిస్ (23), రజత్ పాటిదార్ (16) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0), ప్రభుదేశాయ్ (2) విఫలం కాగా.. షాబాజ్ అహ్మద్ (17) కారణంగా దినేశ్ కార్తీక్ (6) రనౌట్ అయ్యాడు. దీంతో బెంగళూరు విజయం పై ఆశలు వదిలేసుకుంది. హసరంగ(18) చివర్లో రాణించినా.. అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్‌సేన్ నాలుగు, అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌లో అర్థశతకంతో పాటు ఫీల్డింగ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్న పరాగ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.