భారత క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్ గా ఉన్న సంగతి తెలిసిందే..! ఆయన్ను భారత క్రికెట్ జట్టు కోచ్ గా ఉంచాలనే డిమాండ్ కూడా చాలా రోజుల నుండి నడుస్తూ ఉంది. అయితే రాహుల్ ద్రావిడ్ అందుకు అప్లై చేసుకోవడం లేదు. ఎంతో మంది యంగ్ ట్యాలెంట్ ను తీర్చిదిద్దుతూ ఉన్నాడు ద్రావిడ్. అయితే ఓ సిరీస్ కు మాత్రం ద్రావిడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు.
జులై నెలలో శ్రీలంక టూర్ కు రాహుల్ ద్రావిడ్ కూడా భారత జట్టుతో వెళ్లబోయే అవకాశాలు ఉన్నాయి. ఆ సిరీస్ లో భారతజట్టుకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. మొత్తం ఆరు మ్యాచ్ లు శ్రీలంకతో భారత జట్టు తలపడే అవకాశం ఉంది. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్స్ ఆడడం లేదు. మెయిన్ జట్టు ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లగా.. యంగ్ ఆటగాళ్లను శ్రీలంక సిరీస్ కు పంపింది బీసీసీఐ. మూడు వన్డే మ్యాచ్ లు, మూడు టీ20 మ్యాచ్ లు భారత జట్టు శ్రీలంకతో ఆడనుంది.
విరాట్ కోహ్లీతో మొత్తం కోచింగ్ స్టాఫ్ యునైటెడ్ కింగ్డమ్ కు వెళ్లనుండగా.. యువ భారత జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరిస్తారని బీసీసీఐ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. యంగ్ టీమ్ లో ఉన్న వాళ్లంతా ఇండియా-ఏ జట్టు సభ్యులు కావడంతో ద్రావిడ్ కు అందరూ తెలిసిన వాళ్ళేనని కూడా వెల్లడించారు. జట్టు సభ్యులను కూడా బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
రాహుల్ ద్రావిడ్ చాలా రోజులుగా కోచింగ్ ఫీల్డ్ లోనే ఉంటూ వస్తున్నారు. ఎన్.సి.ఏ. బాధ్యతలను చక్కబెట్టడమే కాకుండా.. అండర్-19 లోనే ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లను ద్రావిడ్ జల్లెడ వేస్తున్నారు. జులై 13, 16, 19 న మూడు వన్డేలలో శ్రీలంకతో భారత్ తలపడనుంది. జులై 22-27 మధ్య మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.