టీమ్ఇండియా కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న రాహుల్‌ద్రావిడ్‌

Rahul Dravid formally applies for head coach's post.టీమ్ఇండియా హెచ్‌కోచ్ ప‌ద‌వికి దిగ్గ‌జ ఆట‌గాడు రాహుల్ ద్రావిడ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Oct 2021 11:55 AM GMT
టీమ్ఇండియా కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న రాహుల్‌ద్రావిడ్‌

టీమ్ఇండియా హెచ్‌కోచ్ ప‌ద‌వికి దిగ్గ‌జ ఆట‌గాడు రాహుల్ ద్రావిడ్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో ప్ర‌స్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న ర‌విశాస్త్రి ప‌ద‌వీకాలం ముగియ‌నుంది. దీంతో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) హెడ్‌కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది. ద‌రఖాస్తు చేయ‌డానికి నేడు ఆఖ‌రి రోజు కావ‌డంతో ద్రావిడ్ ద‌ర‌ఖాస్తు చేశారు. ఇక టీమ్ఇండియా కోచ్‌గా ద్రావిడ్ ఎంపిక కావ‌డం లాంచ‌న‌మే. అయితే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ జరగనుంది.

2017లో అనిల్ కుంబ్లే రాజీనామా తర్వాత హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు రవిశాస్త్రి. ఇప్పటికే శాస్త్రి కోచ్ పదవిలో నాలుగేళ్లుగా కొనసాగుతున్నారు. మరోసారి ఆ బాధ్యతలు చేపెట్టేందుకు అతడు సముఖంగా లేడు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ కూడా మెగా టోర్నీ అనంతరం తమతమ పదవుల నుంచి తప్పుకోనున్నారు. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌.. బౌలింగ్‌ కోచ్‌గా పరాస్‌ మాంబ్రే ఎంపిక లాంఛనం కానుంది. ఇక బ్యాటింగ్‌ కోచ్‌గా ప్రస్తుతం ఉన్న విక్రమ్‌ రాథోడ్ అదే పదవిలో కొనసాగనున్నాడని సమాచారం.

అండర్16, టీమ్ఇండియా ఏ జట్లకి కోచ్‌గా వ్య‌వ‌రించ‌డంతో పాటు ఎన్‌సీఏ డైరెక్టర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు ద్రావిడ్. అత‌డి హ‌యాంలోనే భార‌త అండ‌ర్‌-19జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకుంది. పృథ్వీ షా, శ్రేయాస్ అయ్య‌ర్‌, రిష‌బ్ పంత్‌, ఇషాన్ కిష‌న్ వంటి ఆటగాళ్ల ద్రావిడ్ ఆధ్వ‌ర్యంలోనే రాటుదేలారు. యువ ఆట‌గాళ్ల‌తో ద్రావిడ్‌కు చ‌క్కని అనుబంధం ఉంది.

తొలుత కోచ్ ప‌ద‌వి చేప‌ట్టేందుకు ద్రావిడ్ ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే.. బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ, కార్య‌ద‌ర్శి జైషా లు ఐపీఎల్ ఫైన‌ల్ సంద‌ర్భంగా ద్రావిడ్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో గంగూలీ.. ద్రావిడ్‌ను ఒప్పించారు. దీంతో ద్రావిడ్ నేడు కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

"అవును, గడువుకు చివరి రోజు కావడంతో రాహుల్ అధికారికంగా ఈరోజు దరఖాస్తు చేసుకున్నారు. NCAలోని అతని జట్టు, బౌలింగ్ కోచ్ పరాస్ (మాంబ్రే) మరియు ఫీల్డింగ్ కోచ్ అభయ్ (శర్మ) ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. అతని దరఖాస్తు కేవలం లాంఛనప్రాయమే' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు.

Next Story
Share it