వెస్టిండీస్‌తో రెండో వన్డే.. రాహుల్ ఇన్.. ఇషాన్ ఔట్..!
Rahul and Mayank Agarwal Join Team India Camp Ahead Of 2nd ODI.అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న
By తోట వంశీ కుమార్ Published on 8 Feb 2022 4:10 PM ISTఅహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమ్ఇండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఆరు వికెట్లతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక బుధవారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి సిరీస్ దక్కించుకోవాలని రోహిత్ సేన బావిస్తోండగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ సమయం చేయాలని పొలార్డ్ సేన గట్టి పట్టుదలతో ఉంది. దీంతో రెండో వన్డేలో హోరా హోరి పోరు ఖాయంగా కనిపిస్తోంది.
ఇక తొలి వన్డేకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్న ఓపెనర్ రాహుల్ జట్టులో చేరాడు. అతడితో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సైతం క్వారంటైన్ పూర్తి చేసుకోగా.. కరోనా నుంచి కోలుకున్న నవదీప్ సైనీ సైతం జట్టుతో కలిసాడు. వీరందరూ ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశారు. ఇక రాహుల్ రావడంతో ఇషాన్ కిషన్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఒక వేళ ఇషాన్‌ను ఓపెనర్‌గా ఆడించాలని టీమ్‌బావిస్తే.. రాహుల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించే అవకాశం ఉంది.
అప్పుడు దీపక్ హుడాపై వేటు పడే ఛాన్స్ ఉంది. మరీ తుది జట్టులో సైనీకి చోటు దక్కుతుందో లేదో చెప్పలేము. ఇక తొలి వన్డేలో విఫలం అయిన శార్దూల్ ఠాకూర్‌కు మరో అవకాశం ఇస్తారా..? లేదంటే అతడి స్థానంలో దీపక్ చాహర్‌ను తీసుకుంటారా..? అన్నది తెలియాల్సి ఉంది. గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ తొలి వన్డేలో ఫామ్‌లోకి రాగా.. స్టార్ బ్యాట్స్‌మెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ కూడా ఫామ్‌లోకి రావాలని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇక శతకం సాధించక దాదాపు రెండుళ్లు అవుతుండడంతో కనీసం రేపటి మ్యాచ్‌లోనైనా విరాట్ శతకం సాధించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. తొలి వన్డేలో చాహల్, సుందర్‌లు సత్తా చాటడంతో కుల్దీప్ మరోసారి బెంచ్‌కే పరిమితం కాకతప్పదు. ఇక తొలి వన్డేలో ఆడిన జట్టులో ఒకటి లేదా రెండు మార్పులో టీమ్ఇండియా బరిలోకి దిగే అవకాశం ఉంది.
భారత తుది జట్టు అంచనా :
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా/ ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ / శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్