ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంది. గురువారం రాత్రి తిరుమల చేరుకున్న సింధు.. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుంది. రంగనాయకుల మండపంలో ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.
స్వామివారిని దర్శించుకున్న అనంతరం సింధు మాట్లాడుతూ.. శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏడాది స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వస్తానని.. ఈ సారి ఒలింపిక్స్ అయ్యాక తిరుమలకు వచ్చానని, స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాని వెల్లడించింది. యువతను ప్రోత్వహించేందుకు విశాఖపట్నంలో త్వరలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేస్తానని తెలిపింది. చాలా మంది యువత సరైన ప్రోత్సాహం లేక వెనుకబడుతున్నారని గుర్తు చేసింది. ప్రజలందరూ కోవిడ్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా.. టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం గెలుపొందిన సంగతి తెలిసిందే.