కోచ్‌ను మార్చ‌నున్న‌ మ‌రో ఐపీఎల్ జ‌ట్టు.. మ‌నోళ్ల కోస‌మే వేట‌..!

IPL 2025కు ఇంకా చాలా స‌మ‌యం ఉంది. వచ్చే సీజన్‌కు ఆటగాళ్ల వేలం నిర్వహించాల్సి ఉంది.

By Medi Samrat  Published on  24 July 2024 11:48 AM GMT
కోచ్‌ను మార్చ‌నున్న‌ మ‌రో ఐపీఎల్ జ‌ట్టు.. మ‌నోళ్ల కోస‌మే వేట‌..!

IPL 2025కు ఇంకా చాలా స‌మ‌యం ఉంది. వచ్చే సీజన్‌కు ఆటగాళ్ల వేలం నిర్వహించాల్సి ఉంది. మెగా వేలంలో పలు టీమ్‌లలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అంతకంటే ముందే కోచ్‌ల మార్పు పర్వం మొదలైంది. అందులో భాగంగానే రికీ పాంటింగ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలగించింది. పాంటింగ్ చాలా కాలం పాటు జట్టుకు కోచ్‌గా కొనసాగాడు. ఢిల్లీ భాట‌లోనే పంజాబ్ కింగ్స్ జట్టు కూడా అదే పని చేయాలని ఆలోచిస్తోంది.

ఇదే జ‌రిగితే రికీ పాంటింగ్ తర్వాత ఐపీఎల్‌లో మరో ఆస్ట్రేలియా కోచ్ ప్రయాణం ముగియవచ్చు. పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్‌ను కూడా టీమ్ మేనేజ్‌మెంట్ త‌ప్పించే అవ‌కాశం ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టుతో ఆయ‌న రెండేళ్ల కాంట్రాక్ట్ ముగిసింది. ఫ్రాంచైజీ కాంట్రాక్ట్ ను పొడిగించే అవకాశం చాలా తక్కువగా ఉంది. 2014 నుంచి పంజాబ్ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ జ‌ట్టు ఒకేసారి రన్నరప్‌గా నిలిచింది.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. పంజాబ్ జట్టు భారత కోచ్ కోసం వెతుకుతోంది. భారత కోచ్‌ని ఎంపిక చేస్తారా లేదా అనేది ఇంకా నిర్ణయించనప్పటికీ.. వారు ప‌లువురు మాజీల పేర్ల‌ను పరిశీలిస్తున్నట్లు భావిస్తున్నారు. అందులో ఒకరు సంజయ్ బంగర్. అతడు గతంలో ఈ ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్నాడు. జూలై 22న జరగాల్సిన బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. ఆ సమావేశం జరగలేదు. ఈ ఏడాది చివర్లో జరగనున్న మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ ఇతరుల పేర్ల‌ను కూడా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఐపీఎల్‌లో భారత కోచ్‌లు ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజయం సాధించింది. అతడు రాజస్థాన్ రాయల్స్ కోచ్ అయ్యే అవకాశం ఉంది. గౌతమ్ గంభీర్ మెంటార్‌గా.. చంద్రకాంత్ పండిత్ కోచ్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఈ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిపారు. గంభీర్ ఇప్పుడు టీమిండియా ప్రధాన కోచ్ అయ్యాడు. ఆశిష్ నెహ్రా 2022లో గుజరాత్ టైటాన్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా చేసి 2023లో ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్‌లో సౌరవ్ గంగూలీ ముఖ్యమైన పాత్రను పోషించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రాబోయే సీజన్ కోసం దినేష్ కార్తీక్‌ను తన కోచింగ్ స్టాఫ్‌లో చేర్చుకుంది.

61 ఏళ్ల ట్రెవర్ బేలిస్ ఐపీఎల్‌లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలతో కలిసి పనిచేశాడు. పంజాబ్ కింగ్స్ కంటే ముందు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోచ్‌గా ఉన్నాడు. గత ఐదేళ్ళుగా టీ20 టోర్నీల్లో ఆయ‌న‌ రికార్డు చాలా పేలవంగా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, సిడ్నీ థండర్, పంజాబ్ కింగ్స్‌లతో ఏ జ‌ట్టు రాణించ‌క‌పోవ‌డంతో ఆయ‌న టైం బాగాలేదు.

Next Story