ఐపీఎల్ 2023 8వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మ్యాచ్ లో పంజాబ్ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంది. తొలి 10 ఓవర్లలో పంజాబ్ జట్టు 90 పరుగులకు పైగా పరుగులు చేసింది. అయితే 11వ ఓవర్ తొలి బంతికి పంజాబ్ జట్టుకు షాకిచ్చే ఘటన జరిగింది.
మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 11వ ఓవర్ వేశాడు. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ తొలి బంతికే భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్‌కు తగిలి నేరుగా అవతలి ఎండ్‌లో నిలబడిన పంజాబ్ బ్యాట్స్‌మెన్ భానుక రాజపక్సే వద్దకు వెళ్లింది. ఈ బంతి రాజపక్సే చేతికి తగిలింది. షాట్ చాలా వేగంగా ఉండటంతో మ్యాచ్ మధ్యలో రాజపక్సేకు వైద్య చికిత్స అందించారు. అయినా భానుక రాజపక్సే బాధతో మైదానం వీడాల్సి వచ్చింది. రాజపక్సే గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై హాఫ్ సెంచరీ చేశాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాడు కావడంతో పంజాబ్‌కు పెద్ద దెబ్బే అని అంటున్నారు.
గౌహతి మైదానంలో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించాయి. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ 72 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ 7 పరుగుల తేడాతో కేకేఆర్‌ను ఓడించింది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య 24 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్ పైచేయి సాధించింది. రాజస్థాన్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.