ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. మిగిలిన మ్యాచ్‌లకు పృథ్వీ షా దూరం
Prithvi Shaw Ruled Out Of The Remainder Of IPL 2022.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో ఓ అడుగు ముందుకు
By తోట వంశీ కుమార్ Published on 13 May 2022 2:35 PM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో ఓ అడుగు ముందుకు మరో అడుగు వెనకకు లాగా సాగుతోంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రయాణం. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడగా.. 6 మ్యాచుల్లో విజయం సాధించగా.. మరో ఆరు మ్యాచుల్లో ఓటమి పాలైంది. మొత్తంగా 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతూ.. ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది. మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితిలో ఉంది ఆ జట్టు.
ఇలాంటి కీలక సమయంలో ఫామ్‌లో ఉన్న ఆ జట్టు ఓపెనర్, యువ ఆటగాడు పృథ్వీ షా అనారోగ్యం బారిన పడి లీగ్‌లోని మిగతా మ్యాచులకు దూరం అయ్యాడు. పృథ్వీ షా కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడని ఆ జట్టు సహాయక కోచ్ షేన్ వాట్సన్ వెల్లడించాడు. దీంతో లీగ్‌లో మిగిలిన మ్యాచుల్లో అతడు ఆడలేడని చెప్పేశాడు.
'పృథ్వీ షా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. పుల్ ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా దూరం కావడం జట్టుకు తీరని నష్టం. ఆరంభంలోనే బౌలర్లకు ముచ్చెటమలు పట్టిస్తూ అలవోకగా బౌండరీలు బాది ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తెచ్చేవాడు. లీగ్ స్టేజ్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు అందుబాటులోఉండడు. అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.' అని వాట్సన్ అన్నాడు. కాగా.. పృథ్వీ షా టైఫాయిడ్‌తో బాధపడుతున్నాడని ఢిల్లీ కెప్టెన్ రిషబ్‌పంత్ తెలిపాడు.
ఈ సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన పృథ్వీ 28.78 సగటుతో 259 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థశతకాలు కూడా ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌తో మే 16న ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.