భారత దేశవాళీ క్రికెట్‌లో ఓపెనర్ పృథ్వీ షా సంచలన ఇన్నింగ్స్‌లో చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. 152 బంతుల్లో 31 పోర్లు, 5 సిక్సర్లు బాది 227పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన 8వ ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. పుదుచ్చేరీతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా ఈ ఘనత సాధించాడు.
ఇటీవల కాలంలో పేలవ ఫామ్ తో సతమతమవుతూ టీమ్ఇండియాలో స్థానం కూడా కోల్పోయిన పృథ్వీ షా పుదుచ్చేరితో మ్యాచ్ లో తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. షా ప్రస్తుతం ముంబయి జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. పృథ్వీకి తోడు తొలిసారి భారత జట్టుకు ఎంపికైన సూర్యకుమార్ యాదవ్ కూడా దంచికొట్టాడు. 58 బంతుల్లో 22 పోర్లు, 4 సిక్స్‌లు బాది 133 పరుగులు చేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 201 జోడించారు. వీరిద్దరి ధాటికి ముంబై 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 457 పరుగులు చేసింది.
షా కంటే ముందు లిస్ట్ ఏ క్రికెట్‌లో ఏడుగురు డబుల్ సెంచరీలు సాధించారు. సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, శిఖర్ ధావన్, కర్ణ్ కౌషల్ తర్వాత ఈ ఘనత సాధించిన 8వ ఇండియన్ బ్యాట్స్‌మన్ పృథ్వి షా నే.