భారత మహిళల జట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీ ఫైనల్ కు చేరుకోగలదు.. ఎలాగంటే.?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త మ‌హిళల జ‌ట్టు ఆదివారం షార్జాలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని ఎదుర్కొంది

By M.S.R  Published on  14 Oct 2024 7:41 AM IST
భారత మహిళల జట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీ ఫైనల్ కు చేరుకోగలదు.. ఎలాగంటే.?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త మ‌హిళల జ‌ట్టు ఆదివారం షార్జాలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని ఎదుర్కొంది. త‌ప్ప‌క గెల‌వాల్సిన ఈ మ్యాచ్‌లో 9 ప‌రుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిని అందుకుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 151 ప‌రుగులు చేసింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో గ్రేస్ హారిస్ 40 ర‌న్స్ చేసింది. భార‌త అమ్మాయిల్లో రేణుక‌, దీప్తి చెరో రెండు వికెట్లు, రాధా యాద‌వ్‌, శ్రేయాంక‌, పూజ త‌లో వికెట్ తీశారు. అనంత‌రం 152 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన టీమిండియా 142 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ హాఫ్ సెంచ‌రీ (54 నాటౌట్‌)చేసి చివ‌రి వ‌ర‌కు పోరాడినా ఫ‌లితం ద‌క్క‌లేదు. దీప్తి శ‌ర్మ 29, ష‌ఫాలీ వ‌ర్మ 21 ప‌రుగులు చేశారు.

నాలుగు మ్యాచుల్లో రెండు విజ‌యాలు, రెండు ఓట‌ముల‌తో ప్ర‌స్తుతం భార‌త్ ఖాతాలో 4 పాయింట్లు మాత్ర‌మే ఉన్నాయి. నేడు పాక్‌తో జ‌రిగే మ్యాచులో న్యూజిలాండ్ గెలిస్తే టీమిండియా ఇంటికే పరిమితమవుతుంది. గ్రూప్‌-ఎలో సోమవారం జరిగే చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను పాకిస్థాన్ ఓడించగలిగితే భారత్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. పాకిస్థాన్ గెలిస్తే భారత్, న్యూజిలాండ్‌లతో పాటు 4 పాయింట్లు ఉంటాయి. అయితే, మెరుగైన నెట్ రన్ రేట్ (NRR) కారణంగా భారత మహిళల జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌లు వరుసగా గెలిచి 8 పాయింట్లతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. భారత మహిళల జట్టుకు అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి.

Next Story