Video : అమన్‌కు ఫోన్ చేసి నాలుగు నిమిషాలు మాట్లాడిన‌ ప్రధాని.!

కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు.

By Medi Samrat  Published on  10 Aug 2024 7:46 PM IST
Video : అమన్‌కు ఫోన్ చేసి నాలుగు నిమిషాలు మాట్లాడిన‌ ప్రధాని.!

కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు. నువ్వు కష్టపడి ఇక్కడికి చేరుకున్నావు.. కాబట్టి నీ జీవితం దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారుతుందని మోదీ అమన్‌తో అన్నారు. శుక్రవారం జరిగిన పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో అమన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో 21 ఏళ్ల అమన్ 13-5 తేడాతో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్‌ను ఓడించాడు.

రెజ్లర్ అమన్ గురువారం జరిగిన ప్రీ-క్వార్టర్‌ఫైనల్స్, క్వార్టర్‌ఫైనల్స్‌లో బలమైన ప్రదర్శన ఇచ్చాడు, అయితే పురుషుల 57 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీ-ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన టాప్ సీడ్ రీ హిగుచితో ఏకపక్ష పోరులో ఓడిపోయాడు. అమన్ గురువారం పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ.. కాంస్య పతక మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి పారిస్ క్రీడల్లో దేశానికి ఆరో పతకాన్ని అందించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఐదు కాంస్య, ఒక రజతం సహా మొత్తం ఆరు పతకాలు సాధించింది.

ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున అమన్ ఏకైక పురుష రెజ్లర్. 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి భారత్ ప్రతి ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో పతకాలు సాధిస్తూ వస్తోంది. 2008లో సుశీల్ కుమార్ కాంస్యం, 2012లో సుశీల్ రజతం, యోగేశ్వర్ దత్ కాంస్యం, 2016లో సాక్షి మాలిక్ కాంస్యం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రవి దహియా రజతం, బజరంగ్ పునియా కాంస్యం సాధించారు.

ప్రధాని అమన్‌ను ఫోన్‌లో హలో అమన్‌ అన్నారు. మీకు చాలా అభినందనలు. మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు. మీరు యావత్ దేశం హృదయాలను గెలిచారు. మీ జీవితం దేశప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకమని నేను నమ్ముతున్నాను. ఒలింపిక్స్‌లో పతకం తెస్తున్న అతి పిన్న వయస్కుడివి నువ్వు. మీకు ఇంకా ఎంతో వ‌య‌సు ఉంది. మీరు దేశాన్ని సంతోషంతో నింపుతారని నేను నమ్ముతున్నాను. నువ్వు జీవితంలో చాలా కష్టపడ్డావు. మీ తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత కూడా నీవు స్థిరంగా ఉన్నావు. మీ జీవితం చాలా స్ఫూర్తిదాయకం. ఇది దేశ ప్రజల ఆశీర్వాదం, మీ కృషి కూడా. 2028లో జరిగే ఒలింపిక్స్‌లో స్వర్ణం తెచ్చేందుకు కృషి చేస్తాన‌ని అమ‌న్ అన‌గా.. మీరు విజయం సాధిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు.

Next Story