పొట్టి ప్రపంచకప్‌ను అత్యధికంగా రెండు సార్లు ముద్దాడిన వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో దారుణంగా విఫలమైంది. క్వాలిఫయింగ్ రౌండ్ ను కూడా దాటలేకపోయింది. ఓ విజయం, రెండు ఓటములతో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు కోచ్ ఫిల్ సిమన్స్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. జట్టుకు విజయాన్ని అందించలేనప్పుడు కోచ్‌గా కొనసాగడం అర్థం లేదని భావించాడు. దీంతో తన కోచ్ పదవికి రాజీనామా చేశాడు.
ఈ విషయాన్ని విండీస్ బోర్డు కూడా ధృవీకరించింది. అయితే.. వెంటనే అతడు బాధ్యతల నుంచి తప్పుకోవడం లేదని తెలిపింది. ఆస్ట్రేలియాతో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగే టెస్టు సిరీస్ వరకు కొనసాగనున్నట్లు తెలిపింది. ఈ సిరీస్ తరువాత కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు తెలియజేసింది.
"వెస్టిండిస్ అనేది ఓ జట్టు మాత్రమే కాదు. కొన్ని దేశాల కలయిక. 2022 టీ20 ప్రపంచకప్‌లో జట్టు ప్రదర్శన నిరుత్సాహం కలిగించింది. మేము మా స్థాయికి తగ్గట్లు రాణించలేదు. అభిమానులు, అనుచరులు అందరినీ నేను క్షమాపణలు చెబుతున్నా. ఇక ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ అనంతరం వెస్టిండీస్ కోచ్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా" అని సిమన్స్ చెప్పాడు.