'ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అత‌డి కెరీర్‌ను రిస్క్ చేయలేను'.. గాయపడిన ఆటగాడి గురించి పీసీబీ చైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు

22 ఏళ్ల సామ్ అయూబ్ చీలమండ గాయం విషయంలో బోర్డు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వెల్లడించారు.

By Medi Samrat  Published on  26 Jan 2025 7:15 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అత‌డి కెరీర్‌ను రిస్క్ చేయలేను.. గాయపడిన ఆటగాడి గురించి పీసీబీ చైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు

22 ఏళ్ల సామ్ అయూబ్ చీలమండ గాయం విషయంలో బోర్డు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వెల్లడించారు. అయూబ్ రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడ‌క‌పోవ‌చ్చ‌ని, అయూబ్ సుదీర్ఘ కెరీర్‌ను దృష్టిలో ఉంచుకున్నట్లు నఖ్వీ నొక్కి చెప్పాడు. పాకిస్థాన్ జ‌ట్టు త‌రపున ఈ మ‌ధ్య కాలంలో బాగా రాణిస్తున్న‌ అయూబ్.. టోర్నమెంట్‌లో పాల్గొనడంపై అనిశ్చితిని ఎదుర్కొంటున్నాడు. మీడియాతో నఖ్వీ మాట్లాడుతూ.. అయూబ్ కోలుకునే ప్రక్రియను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో అయూబ్ చీలమండకు తీవ్ర గాయం అయ్యింది. మరుసటి రెండు రోజుల్లో అయూబ్ చీలమండపై ఉన్న ప్లాస్టర్‌ను తొలగిస్తామని.. అయితే అతను కోలుకుంటేనే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులోకి వస్తాడని నఖ్వీ ధృవీకరించారు.

నఖ్వీ మాట్లాడుతూ.. నేను అయూబ్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాను. అతడు ప్రస్తుతం పునరావాసం పొందుతున్నాడు. అతని చీల‌మండ‌ ప్లాస్టర్ 1-2 రోజుల్లో తొలగించబడుతుంది. ఆ తరువాత అతడు రికవరీ దశలోకి ప్రవేశిస్తాడు. దీనికి సమయం పడుతుంది. ఒక్క ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అతడి భవిష్యత్తును పణంగా పెట్టడం నాకు ఇష్టం లేదు. సామ్ అయూబ్ మాకు విలువైన ఆస్తి.. దేవుడు ఇష్టపడితే అతడు త్వరగా కోలుకుంటాడని పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు ఏడో ఓవర్‌లో అయూబ్ జారిపడి అతని చీలమండకు తీవ్ర గాయం కావడంతో అతడిని స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. చికిత్స కోసం వెంటనే అత‌డిని ఇంగ్లాండ్‌కు తరలించారు. అక్క‌డ చికిత్స అనంత‌రం క్ర‌మంగా అత‌డు కోలుకుంటున్నాడు.

Next Story