Pat Cummins:మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్.. కెప్టెన్ కమిన్స్ దూరం
వ్యక్తిగత కారణాలతో మూడో టెస్టుకు కెప్టెన్ కమిన్స్ దూరం అయ్యాడు. స్టీవ్ స్మిత్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు
By తోట వంశీ కుమార్
మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్
భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం మిగిలిన మ్యాచుల్లో అయిన గెలిచి పరువు నిలుపుకోవాలని బావిస్తుండగా ఆ జట్టుకు మరో షాక్ తగింది. సిరీస్ ప్రారంభానికి ముందే స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ చీలమండల గాయం కారణంగా దూరం కాగా వార్నర్ సైతం రెండో టెస్టులో గాయపడడంతో మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయిన సంగతి తెలిసిందే. తాజాగా మూడో టెస్టు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉండడం లేదు.
రెండో టెస్టు అనంతరం వ్యక్తిగత పనుల నిమిత్తం కమిన్స్ స్వదేశానికి వెళ్లాడు. మూడో టెస్టు నాటికి వస్తాడని ఆస్ట్రేలియా జట్టు తొలుత చెప్పింది. అయితే.. తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో మూడో టెస్టుకు కమిన్స్ రావడం లేదు. ఈ విషయాన్ని కమిన్స్ స్థానిక మీడియాకు తెలిపాడు. "అమ్మ ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇలాంటి సమయంలో ఆమె పక్కనే ఉండడం ఎంతో ముఖ్యం. అందుకనే ఇండియాకు వెళ్లడం లేదు. ఇదే విషయాన్ని చెప్పాను. నా పరిస్థితిని క్రికెట్ ఆస్ట్రేలియా, జట్టు సభ్యులు అర్థం చేసుకున్నారు." అని కమిన్స్ అన్నాడు.
🚨 JUST IN: Pat Cummins to miss the third #INDvAUS Test as Australia name replacement captain.
— ICC (@ICC) February 24, 2023
Details ⬇️#WTC23 https://t.co/HMD0lqWO7m
మూడో టెస్టుకు కమిన్స్ దూరం కావడంతో స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. మార్చి 1 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇండోర్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.